బాలీవుడ్ పై రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాల దాడి కొనసాగుతుంది. మహేష్ మూవీ సర్కారు వారి సక్సెస్ ని ఉద్దేశిస్తూ హిందీ చిత్ర పరిశ్రమపై వర్మ మరో స్ట్రాంగ్ సెటైర్ విసిరారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) బాలీవుడ్ లో అనేక చిత్రాలు చేశారు. ఆయనను దేశం మెచ్చిన దర్శకుడిని చేసింది హిందీ చిత్ర పరిశ్రమే. అక్కడ ఆయన తెరకెక్కించిన రంగీల, సత్య, సర్కార్ వంటి చిత్రాలు ఆయన ఇమేజ్ ని దేశవ్యాప్తం చేశాయి. అమితాబ్ లాంటి బడా స్టార్స్ తో చిత్రాలు చేసిన వర్మ ప్రస్తుతం ఆ పరిశ్రమను వదిలేశారు. కొన్నాళ్లుగా ఆయన టాలీవుడ్ కే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా కాన్సెప్ట్ రావడం, సౌత్ చిత్రాలు బాలీవుడ్ లో సత్తా చాటడం పరిపాటిగా మారింది. నెలల వ్యవధిలో పుష్ప, ఆర్ ఆర్ ఆర్ , కెజిఎఫ్ 2 చిత్రాలు బాలీవుడ్ ని షేక్ చేశాయి.
పుష్ప రూ. 100 కోట్ల మార్క్ చేరుకోగా... ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) రూ. 275 కోట్లు, కెజిఎఫ్ 2 (KGF 2) రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అదే సమయంలో ఈ మూడు నెలల్లో విడుదలైన హిందీ చిత్రాలు సౌత్ చిత్రాలకు కనీస పోటీ ఇవ్వలేకపోయాయి . ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొద్దిరోజులుగా వర్మ బాలీవుడ్ పై విమర్శలు సంధిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ పరిశ్రమ ఓటీటీ కోసమే చిత్రాలు చేస్తే బెటర్ అంటూ ఆయన సెటైర్ వేశారు.
ఇక ఈ వారం బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ జయేష్ భాయ్ జోర్దార్(jayeshbhai jordaar), టాలీవుడ్ లో మహేష్ సర్కారు వారి పాట విడుదల కావడం జరిగింది. వీకెండ్ ముగిసే నాటికి ఈ రెండు చిత్రాల కలెక్షన్స్ ని ఉద్దేశిస్తూ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్ లో... రణ్వీర్ సింగ్ జయేష్ భాయ్ జోర్దార్ వీకెండ్ ముగిసే నాటికి రూ. 11.75 కోట్లు రాబట్టింది. మహేష్ సర్కారు వారి పాట మూవీ రూ. 135 కోట్లు రాబట్టింది అంటూ పొందుపరిచారు. పరోక్షంగా మహేష్, రణ్వీర్ సింగ్ బాక్సాఫీస్ స్టామినా ఏమిటో ఆయన తెలియజేశారు.
మహేష్ నటించిన ప్రాంతీయ చిత్రం వారాంతానికి రూ. 135 కోట్లు రాబడితే, రణ్వీర్ సింగ్ చిత్రం మాత్రం కేవలం రూ. 11.75 కోట్లు రాబట్టిందని వ్యంగ్యాస్త్రం వదిలారు. కాగా ఇటీవల మహేష్ బాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నన్ను 'అఫోర్డ్' చేయలేదు, ఇక్కడ సినిమాలు చేయడం సమయం వృధా చేసుకోవడమే అన్నారు. మహేష్ వ్యాఖ్యలకు బాలీవుడ్ మీడియా మండిపడింది. దీనితో మహేష్ తన ఉద్దేశం ఏమిటో వివరణ ఇచ్చారు. ఇక మహేష్ వ్యాఖ్యలు నాకు అర్థం కాలేదని వర్మ కామెంట్ చేయడం విశేషం.
ఇక నెగిటివ్ టాక్ లో కూడా సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో మహేష్ మూవీ సత్తా చాటుతుంది. యూఎస్ లో సర్కారు వారి పాట $ 2 మిలియన్ మార్క్ దాటివేసింది. నాలుగు రోజులకు ఏపీ/తెలంగాణాలో కలిపి రూ. 75 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.
