వ్యూహంలో ఎవరిని టార్గెట్ చేయడం లేదని.. జగన్ అంటే ఏంటో చూపిస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. తాను నమ్మిన నిజాన్ని చూపిస్తున్నానని.. ఈ సినిమాలో ఎన్నో అంశాలు వుంటాయని వర్మ చెప్పారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘‘వ్యూహం’’ సినిమాపై టీడీపీ నేతల విమర్శల నేపథ్యంలో ఆర్జీవీ స్పందించారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యూహంలో తన అభిప్రాయం మాత్రమే వుంటుందన్నారు. తాను నమ్మిన నిజాన్ని చూపిస్తున్నానని.. ఈ సినిమాలో ఎన్నో అంశాలు వుంటాయని వర్మ చెప్పారు. వివేకా హత్య గురించి కూడా ప్రస్తావిస్తానని ఆర్జీవీ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తప్పించి మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరూ తనను కామెంట్ చేయడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వ్యూహం సినిమా ప్రభావం చూపుతుందని ఆర్జీవీ పేర్కొన్నారు. 

ఇక రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హీరోల రెమ్యూనరేషన్‌పై చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. రెమ్యూనరేషన్ ఇచ్చే వాడిదే తప్పని, తీసుకునేవాడిది కాదన్నారు. హీరోల మార్కెట్‌ను బట్టే రెమ్యూనరేషన్ వుంటుందని ఆర్జీవీ స్పష్టం చేశారు. వ్యూహంలో ఎవరిని టార్గెట్ చేయడం లేదని.. జగన్ అంటే ఏంటో చూపిస్తానని వర్మ పేర్కొన్నారు. ఈ సినిమా వెనుక వైసీపీ నేతలు లేరని స్పష్టం చేశారు. 60 నుంచి 70 శాతం సినిమా కంప్లీట్ అయ్యిందని, త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తామని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.