కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా ఈ చిత్రం నాగార్జున ఐకానిక్ ఫిలిం మన్మథుడుకి సీక్వెల్ అనుకున్నారు. దీనితో ఫ్యామిలీ ఆడియన్స్, నాగార్జున అభిమానుల్లో ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఇది మన్మథుడు సీక్వెల్ కాదని ఓ ప్రెంచ్ చిత్రానికి రీమేక్ అని ప్రకటించింది. 

ఈ చిత్ర ట్రయిలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై ఆసక్తి నెలకొన్నా.. ఇందులో అడల్ట్ కామెడీ ఉందనే అభిప్రాయం కలిగింది. నాగార్జునపై ఈ వయసులో రొమాన్స్ ఏంటనే కామెంట్స్ వినిపించాయి. ఈ చిత్రంలో డైలాగ్స్ పై ఇటీవల ఇంటర్వ్యూలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. 

ఈ చిత్రంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. కానీ అవి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాదు. నేను సింగిల్ మీనింగ్ లోనే రాశా. కాస్త కొంటెతనంతో కూడుకున్నవిగా ఉంటాయి కానీ ఇబ్బంది పెట్టేవిగా అనిపించవని రాహుల్ అభిప్రాయ పడ్డాడు. 

నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వస్తోంది. కొన్ని కామెడీ సీన్స్ నవ్వించేవిగా ఉన్నా.. అడల్ట్ డైలాగ్స్ ఎందుకు పెట్టారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.