`లైగర్` నష్టాలు, ఈడీ అధికారులు విచారణతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పూరీ జగన్నాథ్ దాన్నుంచి రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పూరీ మ్యూజింగ్‌ని మళ్లీ స్టార్ట్ చేశారు.
డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. `లైగర్` ఫ్లాప్‌తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు సినిమా నష్టాలు, మరోవైపు ఈడీ అధికారులు విచారణ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ నేపథ్యంలో దాన్నుంచి రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పూరీ మ్యూజింగ్‌ని మళ్లీ స్టార్ట్ చేశారు. గతంలో కరోనా సమయంలో `పూరీ మ్యూజింగ్` పేరుతో ఫిలాసఫీ చెప్పారు. జీవితం గురించి హితబోధ చెప్పారు.
ఇప్పుడు మరోసారి పూరీ మ్యూజింగ్ పేరుతో అనేక విషయాలపై చర్చిస్తున్నారు. తాజాగా ప్రేమ, స్వేచ్ఛ, రిలేషన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `డోంన్ట్ ఓన్` అనే పేరుతో ఈ విషయాలన్నీ చెప్పారు. ప్రేమ పేరుతో ఎదుటి వారి స్వేచ్ఛని హరించకూడదని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఛాయిస్ మాత్రమే అని, అవసరం కాదన్నారు. ప్రేమ పేరుతో అధికారం చెలాయిస్తే అలాంటి ప్రేమ ప్రేమించవద్దని, అలాంటి బంధం నిలవదని తెలిపారు.
పూరీ జగన్నాథ్ చెబుతూ, `బుద్దుడు సర్వసంగ పరిత్యాగి, ఏది నాదని అనుకోవద్దని చెప్పాడు. ఆయన చెప్పాడని అన్నీ వినలేం కదా. బ్యాంక్ బ్యాలెన్స్, ఇళ్లు, కారు ఉండాలనుకుంటాం. దేనినైనా సొంతం చేసుకోండి. కానీ మనిషిని కాదు. ఈ వ్యక్తి నా ఆస్తి అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించవద్దు. అలా అనుకోవడానికి ఫస్ట్ స్టెప్ ప్రేమ. లవ్ పేరుతో ఈ వ్యక్తిని తాడేసి కట్టేస్తారు. దీంతో ఆ వ్యక్తికి ఊపిరాడదు, రాను రాను మీ ప్రేమ వాళ్లకి వేదింపుగా మారుతుంది. అవతలి మనిషి మనం చెప్పినట్టే వినాలి, రహస్యాలన్నీ మనతోనే పంచుకోవాలని అనుకుంటారు. మీది అలాంటి ప్రేమైతే దయజేసి ప్రేమించవద్దు. జీవితంలో ప్రేమ అనేది ఒక ఛాయిస్ మాత్రమే, అంతేకాని అది అవసరం కాదు` అని చెప్పుకొచ్చారు పూరీ.
ఇంకా పూరీ చెబుతూ, ప్రేమ లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చని చెప్పారు. నువ్వు ఎవరినీ ప్రేమించకపోతే కొన్ని సమస్యలు తగ్గినట్టే, నీ ప్రేమ అవతలి వ్యక్తికి ఊపిరాడకుండా చేస్తే ఎలా? ఒక వ్యక్తి మరొకరికి భారం కాకూడదు. ఇద్దరి మధ్య మర్యాద ఉండాలి. గౌరవం, మర్యాదలోనే స్వేచ్ఛ ఉంటుందన్నారు. రెస్పెక్ట్ ఇవ్వకపోతే రక్తసంబంధాలు, బంధాలు తెగిపోతాయి. నీ జీవితం గురించే నీకు తెలియదు. నీ లైఫ్‌లో జరిగే సంఘటనలు కూడా నీకు తెలియవు. మరీ పక్కవాళ్ల జీవితం గురించి నీకెలా తెలుస్తుందని వెల్లడించారు పూరీ. `మనందరం భూమ్మీదకు టూర్ కోసం వచ్చాం. టూరిస్ట్ లా ఉందాం. చూద్దాం. ఎంజాయ్ చేద్దాం, టూర్ పూర్తికాగానే వెళ్లిపోదాం, అంతేకానీ నీతోటి పర్యాటకుడిని సొంతం చేసుకోవాలని మాత్రం చూడొద్ద`ని తెలిపారు పూరీ జగన్నాథ్.

ఇదిలా ఉంటే దర్శకుడిగా పూరీ వరుసగా పరాజయాలను చవిచూస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్` మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో `లైగర్` మూవీని తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదల డిజాస్టర్‌గా నిలిచింది. పూరీకి మరో దెబ్బ పడింది. వరుస పరాజయాల్లో ఉన్న విజయ్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటికీ పూరీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేదు. అయితే కథల కంటే హంగామాకే పూరీ ప్రయారిటీ ఇస్తున్నారని, అందుకే వరుసగా సినిమాలు పోతున్నాయనే టాక్ క్రిటిక్స్ నుంచి వినిపిస్తుంది.
