దర్శకులు హీరోయిన్స్ ని ప్రేమలోకి దించడం ఈ మధ్య  ఎక్కువైపోయింది. ఆమధ్య నందిని అనే నటి కో డైరెక్టర్ ని వివాహం చేసుకోవడం జరిగింది. ఇక సౌత్ ఇండియా సూపర్ స్టార్ నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్నారు.  త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం ఉంది. కాగా మరో యువ దర్శకుడు హీరోయిన్ ని ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధం అయ్యాడు. 


కోలీవుడ్ యంగ్ డైరెక్టర్  దేసింగ్‌ పెరియసామి హీరోయిన్  నిరంజని  అగత్యాన్ మెడలో తాళికట్టనున్నాడు. నటి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నిరంజని, పెరియసామి‌ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లి విషయాన్ని నిరంజని బావగారైన నిర్మాత‌ తిరు  తెలియజేశారు. పెరియసామి నిరంజని  పెళ్లి పత్రికను  సోషల్‌ మీడియాలో అభిమానులతో తిరు పంచుకున్నాడు. పాండిచ్చేరిలో ఫిబ్రవరి 25న పెళ్లి జరగనున్నట్లు డైరెక్టర్‌ దేసింగ్‌  తెలియజేశారు. 


దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ హీరోహీరోయిన్స్ గా గత ఏడాది విడుదలైన కనులు కనులను దోచాయంటే మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యారు దేసింగ్ పెరియసామి. తమిళంలో  కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయాదిత్తల్‌ పేరుతో విడుదలైన ఈ మూవీ రెండు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది.  ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు అహాతియాన్‌ కూతురు నిరంజని అగత్యాన్‌ కూడా నటించగా.. చిత్రీకరణ సమయంలోనే ఆమెతో దర్శకుడు ప్రేమలో పడ్డాడట. ఇక అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య వీరి వివాహం జరగనుంది. పెళ్లి అనంతరం చెన్నైలో చిత్ర ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహిస్తారని సమాచారం.