వెండితెరపై 'సోలో','శ్రీరస్తు శుభమస్తు','గీత గోవిందం' వంటి సరికొత్త ప్రేమకథలను తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ నిజజీవితంలో కూడా ఓ ప్రేమకథను నడిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన రియల్ లవ్ స్టోరీని అభిమానులతో పంచుకున్నాడు. ''నాది నర్సీపట్నం. నేను ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయిది మాత్రం హైదరాబాద్. వాళ్లు కూకట్ పల్లిలో ఉండేవాళ్లు.

సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. మా అత్త చెల్లెల్ని కాలేజ్ లో డ్రాప్ చేయడానికి వెళ్లినప్పుడు నేను ఆ అమ్మాయిని చూశాను. తొలిచూపులోనే ప్రేమించాను. చూడడానికి చాలా పద్దతిగా సంస్కారంగా ఉండేది. అప్పటినుండి ఆమె వెనుక ఓ సంవత్సరం పాటు తిరిగాను. ఒకరోజు ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పేశాను. ఆమె కొంత టైం తీసుకొని ఓకే చెప్పింది. మొదట్లో కులాలు వేరు, ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని చెప్పింది.

ఆ తరువాత నన్ను నన్నుగా ఇష్టపడి ప్రేమించింది. నిజానికి ఆ సమయంలో నా కాళ్లకు చెప్పులు కూడా సరిగ్గా ఉండేవి కావు. రెండు ప్యాంట్లు, మూడు షర్ట్ లు మాత్రమే ఉండేవి. జీవితాంతం ఆమెను నేను గౌరవిస్తాను. నేను ఏమవుతానో నాకే తెలియని రోజుల్లో ఆమె నన్ను నమ్మింది. ఇంట్లో వాళ్లు పెళ్లికి అంగీకరించడం లేదని నాతో పాటు బయటకి వచ్చేసింది. ఆ తరువాత పెళ్లి చేసుకొని చాలా కష్టాలే పడ్డాం.

నాతో పటు సింగిల్ రూమ్ లో అడ్జస్ట్ అయ్యేది. అప్పుడు కూడా మాకు కొన్ని స్వీట్ మెమొరీస్ ఉన్నాయి'' అంటూ తన ప్రేమ కథను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు మగపిల్లలు.