రాముడు, కృష్ణుడు, కర్ణుడు, యముడు ఇలాంటి కొన్ని పౌరాణిక పాత్రలను నందమూరి ఫ్యామిలీ ఓన్ చేసుకుంది. ఆ పాత్రలలో ఎన్టీఆర్ ని తప్పా మరొకరిని ఊహించుకోలేం అన్నంతగా ఆయన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య కూడా రాముడు మరియు కృష్ణుడుతో పాటు అనేక పౌరాణిక పాత్రలు చేశారు. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రలలో మెప్పించారు. చిరుపాయంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా నటించి మెప్పించారు. అలాగే యముడు, దుర్యోధనుడు వంటి పాత్రలు కూడా ఆయన చేయడం జరిగింది. 

కాగా నేడు ప్రభాస్ హీరోగా రామాయణంపై పాన్ ఇండియా మూవీ ప్రకటన జరిగింది. దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణంపై ఓ భారీ చిత్రం తెరకెక్కనుంది. ఈ త్రీడి మూవీలో ప్రభాస్ రాముని పాత్ర చేయనున్నారు. ఆదిపురుష్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. కాగా ప్రభాస్ తో  మూవీ ప్రకటించిన నాగ్ అశ్విన్ ఈ మూవీపై ఓ ట్వీట్ చేశారు. రాముని పాత్రలో ఇండియాలోనే ప్రభాస్ కి మించిన హీరో లేడన్నాడు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపానికి కారణం అయ్యింది. 

నాగ్ అశ్విన్ ట్వీట్ క్రింద కామెంట్స్  తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. రాముని పాత్రకు సరిగ్గా సరిపోయేది ఒక్క ఎన్టీఆర్ మాత్రమే అని వారంటున్నారు. రాముని పాత్ర జూనియర్ ఎన్టీఆర్ రక్తి కట్టించినట్టుగా ఎవరూ చేయలేరని, రాముని పాత్ర చేస్తే కేవలం జూనియర్ ఎన్టీఆర్ చేయాలని వారు కామెంట్స్ చేస్తున్నారు. గుట్టుగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ గిల్లి లేపినట్లు అయ్యింది. నాగ్ అశ్విన్ కనుక ఆ ట్వీట్ వేయకపోతే ఈ కంపారిజన్ వచ్చేది కాదు. ఇక ఈ వివాదం సంగతి ఎలా ఉన్నా ఆదిపురుష్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.