ప్రభాస్ కామెడీ చేస్తాడట.. అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మారుతి.. ఆ రూమర్లపై క్లారిటీ!
ప్రభాస్ సినిమాపై ఎట్టకేలకు, ఇన్నాళ్లకి దర్శకుడు మారుతి ఓపెన్ అయ్యాడు. సినిమా జోనర్, షూటింగ్, రిలీజ్ వంటి అంశాలను వెల్లడించారు. దీంతోపాటు సినిమాపై వచ్చిన రూమర్లకి కూడా ఆయన సమాధానం చెప్పారు.

ప్రభాస్(Prabhas) ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. `సలార్`, `ప్రాజెక్ట్ కే`, మారుతితో రూపొందుతున్న మూవీ(రాజా డీలాక్స్). అయితే ఇప్పటి వరకు మారుతి(Maruthi) సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. కనీసం ప్రారంభమైందనే వార్త లేదు, షూటింగ్ ఎంత వరకు అయ్యింది? ఏం జరుగుతుందనే అప్ డేటే టీమ్ నుంచి రావడం లేదు. వాళ్లు ఈ సినిమాని పూర్తిగా సీక్రెట్‌గా తెరకెక్కిస్తున్నారు. అనేక సందర్భాల్లోనూ నిర్మాతలు, దర్శకుడు ఈ సినిమాపై స్పందించేందుకు నిరాకరించారు. మంచి సందర్భంలో ఆ సినిమా గురించి మాట్లాడతామని చెబుతున్నారు.
ఈ క్రమంలో ఎట్టకేలకు, ఇన్నాళ్లకి దర్శకుడు మారుతి ఓపెన్ అయ్యాడు. సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు. సినిమా జోనర్, షూటింగ్, రిలీజ్ వంటి అంశాలను వెల్లడించారు. దీంతోపాటు సినిమాపై వచ్చిన రూమర్లకి కూడా ఆయన సమాధానం చెప్పారు. అయితే ప్రభాస్ సినిమా గురించి ఏదో ఒక ఇంటర్వ్యూలో కాదు, సెపరేట్ ఇంటర్వ్యూనే చేయాలని, అది చాలా పెద్ద కథ అని, చిన్నగా చెప్పడం సరిపోదన్నారు మారుతి. సినిమాపై స్పందించేందుకు, దాన్ని దాటవేసేందుకు ఈ విధంగా ఆయన రియాక్ట్ అయ్యారు.
సినిమా జోనర్ గురించి చెబుతూ, తన సినిమా అంటే కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎలిమెంట్లు ఉంటాయి. కాబట్టి కచ్చితంగా ప్రభాస్ సినిమాలో ఆయా అంశాలుంటాయన్నారు. అలాగే హీరో సినిమాలో కామెడీ చేస్తాడని కూడా క్లారిటీ ఇచ్చారు. భారీ సినిమాల మధ్య మంచి కామెడీ సినిమా చేయాలని ఉందని గతంలో ప్రభాస్ చెప్పిన మాటలను రిపీట్ చేస్తూ ఈ సినిమా అదే అనే విషయాన్ని స్పష్టం చేశారు దర్శకుడు మారుతి.
అయితే ప్రభాస్ రేంజ్‌లో భారీ స్కేల్‌లో ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు చెప్పారు. గ్రాండియర్ విషయంలో రాజీపడేది లేదని, చాలా లావిష్‌గానూ ఉంటుందన్నారు. అయితే సినిమాని ప్రభాస్ లేకుండానే షూట్ చేస్తున్నారనే రూమర్లపై దర్శకుడు మారుతి రియాక్ట్ అవుతూ, సినిమాల్లో కొన్ని సీన్లలో హీరో అవసరం లేదు. బ్యాక్ నుంచి తీసే సీన్లు, కాళ్లు, చేతులు మాత్రమే కనిపించే సన్నివేశాలకు హీరో అవసరం లేదని, బాడీ డబుల్(డూప్)ని పెట్టి షూట్ చేస్తారని, తాను కూడా అదే చేస్తానని, తాను మాత్రమే కాదు, ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు సంబంధించి అందరు అదే ఫాలో అవుతారని, ప్రతి హీరోకి డబుల్ ఉంటారని తెలిపారు మారుతి.
ప్రభాస్ లేకుండా తాను సినిమా చేస్తే అది హీరోకి తెలియదా? ఆయన ఒప్పుకుంటాడా? రేపు థియేటర్లో ఆడియెన్స్ చూసి ఊరుకుంటారా? అని వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ అప్‌డేట్ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన రెండు భారీ సినిమాలు చేస్తున్నారని, `సలార్`, `ప్రాజెక్ట్ కే` వంటి గ్లోబల్ రేంజ్ ఫిల్మ్స్ తర్వాత తన మూవీ రాబోతుందనే విషయాన్ని ఆయన పరోక్షంగా తన మాటల ద్వారా వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి ఈ విషయాలు తెలిపారు. మొత్తానికి దర్శకుడు మారుతి చెప్పకనే చాలా విషయాలు చెప్పేశారు. ఫ్యాన్స్ ని ఖుషి చేసే విషయాలు వెల్లడించారు.