తెలుగులో బయోపిక్స్ చాలా చాలా తక్కువ. గతంలో కొన్ని బయోపిక్స్ తీసినా అవి నామమాత్రంగా లాగించేసినవే. పేరున్న ఫిలిం మేకర్స్.. అథెంటిక్ బయోపిక్స్ తీసిన దాఖలాలు మన దగ్గర అరుదు. ఐతే ప్రస్తుతం తెలుగులో ఇద్దరు రాజకీయ ఉద్ధండుల జీవిత కథలు వెండితెరకు ఎక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిల బయోపిక్స్ కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ను తేజ రూపొందించనుండగా.. వైఎస్ బయోపిక్ ను ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి.రాఘవ్ తీయబోతున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణే ప్రధాన పాత్ర పోషించనుండగా.. వైఎస్ కథలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తాడన్న ప్రచారం గట్టిగా జరిగింది. ఐతే ఈ ప్రచారంలో నిజం లేదని అంటున్నాడు మహి. తాను వైఎస్ బయోపిక్ కోసం పని చేస్తున్న మాట వాస్తవమే అని.. ప్రస్తుతం స్క్రిప్టు చివరి దశకు చేరుకుందని.. అది అయ్యాకే నటీనటుల గురించి ఆలోచిస్తామని.. తాము ఇప్పటిదాకా మమ్ముట్టినే కాక ఏ నటుడినీ సంప్రదించలేదని మహి స్పష్టం చేశాడు. మమ్ముట్టి వైఎస్ పాత్రకు ఓకే చెప్పాడనగానే ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఆ స్థాయి నటుడు ఈ సినిమాలో నటిస్తే దానికి ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చి జనాలు ఈ చిత్రాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశముంటుంది. మరి నిజంగా మహి దృష్టిలో మమ్ముట్టి ఉన్నాడా.. అతను అడిగితే మమ్ముట్టి ఈ చిత్రం చేయడానికి ముందుకొస్తాడా.. చూద్దాం మరి.