మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే వేడుక నిన్న సాయంత్రం నుంచే ప్రారంభమైంది. హ్యాపీబర్త్ డే యాష్‌ట్యాగ్‌ని జోడిస్తూ, అభిమానులు రూపొందించిన చిరు బర్త్ డే సీడీపీని రామ్‌చరణ్‌ విడుదల చేశారు. ఆ తర్వాత మోహన్‌ పోస్టర్‌, మెగా ర్యాప్‌ సాంగ్‌, అన్‌ సీన్‌ పిక్స్, రేర్‌ ఫ్యాక్ట్స్ పంచుకుంటూ వస్తున్నారు. అయితే ఒక్కరు మాత్రం చిరంజీవికి అందరికి కంటే ముందుగా బర్త్ డే విశెష్‌ తెలిపారు. 

ఆయన ఎవరో కాదు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. నిన్న సాయంత్రమే చిరుకు ఆయన బర్త్ డే విశెష్‌ తెలిపారు. అంతేకాదు ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేశారు. `జై చిరంజీవా.. జగదేక వీర` పాట బ్యాక్‌డ్రాప్‌తో చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల క్లిప్ లతో ఈ వీడియోని రూపొందించారు. ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది. 

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ట్విట్టర్‌లో చెబుతూ, `బాబాయ్‌.. చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో చిరంజీవిలా ప్రకాశించాలని, ఆ శ్రీవారి ఆశీస్సులతో ఇంకెన్నో శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా`అంటూ హ్యాపీ బర్త్ డే చిరంజీవి హ్యాష్‌ ట్యాగ్‌ని పంచుకున్నారు. 

చిరంజీవి, రాఘవేంద్రరావు టాలీవుడ్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. వీరి కాంబినేషన్‌లో 14 సినిమాలు వచ్చాయి. ఒకటి రెండు మినతా మిగిలిన సినిమాలన్నీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచాయి. అందులో `మోసగాడు`, `తిరుగులేని మనిషి`, `అడవి దొంగ`, `కొండవీటి దొంగ`, `చాణక్య శపథం`, `మంచి దొంగ`, `యుద్ధ భూమి`, `రుద్రనేత్ర`, `జగదేక వీరుడు అతిలోక సుందరి`, `రౌడీ అల్లుడు`, `ఘరానా మొగుడు`, `ముగ్గురు మొనగాళ్ళు`, `ఇద్దరు మిత్రులు`, `శ్రీమంజునాథ` వంటి చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చిన విషయం తెలిసిందే.