పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల కారణంగా ఆయన నటిస్తున్న చిత్రాలు కూడా ఆలస్యం అవుతున్నాయనేది వాస్తవం. హరీష్ శంకర్ దాదాపు పవన్ కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలు, రాజకీయ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మంగళవారం రోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. మచిలీ పట్నంలో జనసేన పార్టీ ఈ భారీ సభని నిర్వహించింది. అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వినోదయ సిత్తం, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ఓజి, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల కారణంగా ఆయన నటిస్తున్న చిత్రాలు కూడా ఆలస్యం అవుతున్నాయనేది వాస్తవం. హరీష్ శంకర్ దాదాపు పవన్ కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. గతంలో భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రాన్ని ప్రకటించారు. అది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ గా మారింది. ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ చిత్రం తమిళ మూవీ తేరికి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది.

ఈ తరుణంలో హరీష్ శంకర్ ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి అనేక ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. తేరి చిత్రానికి హరీష్ శంకర్ చాలా మార్పులు చేస్తున్నారని.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్ లో చేంజెస్ చేశారని అంటున్నారు. హరీష్ శంకర్ మాత్రం ఇది రీమేక్ అని ప్రకటించలేదు. ఈ చిత్రం ఆలస్యం అవుతుండడంపై ఓ నెటిజన్ వెటకారంగా స్పందించారు.
హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రాలు హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ పోస్ట్ చేశారు. షాక్ ఫ్లాప్, మిరపకాయ్ సూపర్ హిట్ , గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ , రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్, డీజే హిట్, గద్దలకొండ గణేష్ హిట్ అని కామెంట్ పెట్టారు. ఇంత ట్యాలెంట్ ఉన్న దర్శకుడు ఒక రీమేక్ చిత్ర స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేందుకు మూడేళ్ళ సమయం ఎందుకు తీసుకుంటున్నట్లు అని వెటకారంగా ఉస్తాద్ భగత్ సింగ్ పై కామెంట్ చేశారు.
అతడి కామెంట్ పై హరీష్ శంకర్ తనదైన శైలిలో బదులిచ్చారు. ట్విట్టర్ అనేది భావాలు వ్యక్త పరచడానికే.. వివరణ ఇవ్వడానికి కాదు అని కౌంటర్ వేశారు. ఏది ఏమైనా హరీష్ శంకర్ చిత్రం తప్ప పవన్ అంగీకరించిన అన్ని చిత్రాలు షూటింగ్ కి వెళుతున్నాయి. ఓజి కోసం సుజీత్ ముంబైలో లొకేషన్స్ వేటలో ఉన్నారు.
