వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'వాల్మీకి' సినిమా టైటిల్ ను 'గద్దలకొండ గణేష్' గా మార్చిన సంగతి తెలిసిందే. బోయసామాజిక వర్గం నుండి వ్యక్తమైన ఆందోళన నేపధ్యంలో సినిమా టైటిల్ ని మార్చారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన హరీష్ శంకర్ ఎమోషనల్ అయ్యారు. వాల్మీకి టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొన్ని 
వర్గాల వారి నుంచి నిరసనలు మొద‌ల‌య్యాయని.. సినిమాలో వాల్మీకి మహర్షి తప్పు చేసినట్లు ఎక్కడా చూపించలేదని అన్నారు.

ఏదైనా అభ్యంత‌రాలుంటే సెన్సార్ ప‌రిధిలోకి వ‌స్తుంద‌నుకున్నామని.. కానీ వారి నుండి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడంతో సమస్య లేదనుకున్నామని చెప్పారు. అయితే బోయ‌ సంఘం వారు, వాల్మీకి వ‌ర్గం వారు టైటిల్‌లో  తుపాకీ ఉంద‌నే అభ్యంత‌రాన్ని వ్యక్తం చేశారని.. దాన్ని మార్చినట్లు చెప్పారు. రూ. 30-40 కోట్లు ఖ‌ర్చుపెట్టి 200 మంది టెక్నీషియ‌న్స్ ఓ వ్యక్తినో, వ‌ర్గాన్నో, కులాన్నో, ఓ సంఘాన్నో విమ‌ర్శించడానికి పని చేయలేదని అన్నారు. 

వాల్మీకి మ‌హ‌ర్షి గురించి రెండు గొప్ప డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పారు. ఏ జిల్లాలో ఈ సినిమాను ఆపాల‌ని నిర్ణయం తీసుకున్నారో దాని వ‌ల్ల అక్కడ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ న‌ష్టపోతారని.. వారికి నష్టం జరగకూడదని టైటిల్ మార్చినట్లు వెల్లడించారు. మొదటిసారి తాను ఓడిపోయానని అనిపిస్తోందని హరీష్ శంకర్ భావోద్వేగానికి గురయ్యారు. ఓడిపోవడం అంటే వ్యక్తిగతంగానో, ఒక డైరక్టర్‌గానో, ఒక రైటర్‌గానో కాదని.. ఒక హైందవ సమాజానికి చెందిన వ్యక్తిగా ఓ మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఓడిపోయానని అన్నారు.