దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం అనే భారీ పాన్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కనుంది. చాలా కాలంగా కొత్త చిత్రాలకు సైన్ చేయని సమంత ఏకంగా పాన్ ఇండియా మూవీ ప్రకటించి సర్పైజ్ చేశారు. శాకుంతలం పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదలకానుంది. న్యూ ఇయర్ కానుకగా శాకుంతలం కాన్సెప్ట్ పోస్టర్ అండ్ వీడియో విడుదల చేశారు. ప్రకటనతోనే మూవీపై ఆసక్తికలిగేలా చేశారు దర్శకుడు గుణశేఖర్. 

కాగా ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుండగా... దర్శకుడు గుణశేఖర్ సర్వం సిద్ధం చేస్తున్నాడు. శాకుంతలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా భారీ సెట్స్ వేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో దర్శకుడు గుణశేఖర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారీ ఇండోర్ సెట్ వేస్తున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది. శాకుంతలం మూవీ నేపథ్యం ఏమిటనేది ఇంకా క్లారిటీ లేదు. 

ఇక ఈ ఏడాది చివర్లో శాకుంతలం విడుదల కానుంది. మరో వైపు ఓ తమిళ చిత్రంలో సమంత నటిస్తున్నారు. అలాగే సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో నిర్వహిస్తున్నారు. సమంత హోస్ట్ గా తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ఇది ప్రసారం అవుతుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, తమన్నా, రకుల్, అల్లు అర్జున్, రానా వంటి స్టార్స్ ఈ షోకి అతిధులుగా రావడం జరిగింది. హోస్ట్ గా కూడా సమంత అదరగొడుతున్నారు.