ఇప్పుడు ఇండస్ట్రీలో బయిటా ఎక్కడ విన్నా జెర్సీ కబుర్లే. ముఖ్యంగా దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు.  ‘మళ్లీరావా’పరిచయమైన ఈ దర్శకుడు రెండో సినిమా జెర్శీ తో అటు ఇండస్ట్రీనే కాదు, ఇటు ప్రేక్షక లోకాన్ని తనవైపునకు తిప్పుకొన్నాడు. నాని హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నాని నటన, గౌతమ్‌ దర్శకత్వం గురించి  చాలా మంది సినిమా ప్రముఖులు  మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌  మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ‘జెర్సీ’ సినిమాలో తమ టీమ్  చేసిన తప్పు గురించి చెప్పుకొచ్చారు.  గౌతమ్ మాట్లాడుతూ....1996లో ఒకసారి డే నైట్‌ రంజీమ్యాచ్‌ నిర్వహించారు.

కానీ, ఇక్కడ మేం ఒక తప్పు చేశాం. వాస్తవంగా డేనైట్‌ మ్యాచ్‌లను ఎర్ర బంతితో ఆడరు.. తెల్ల బంతితో ఆడతారు. కాకపోతే సినిమాలో క్రికెటర్ల జెర్సీ తెల్లరంగులో ఉన్నాయి కాబట్టి.. చిత్రీకరణ సౌలభ్యం కోసం ఎర్రబంతి వాడాం. గులాబీ రంగు బంతి కూడా వాడొచ్చన్నది తర్వాత గుర్తొచ్చింది అన్నారు. ఇక జెర్సీ కథకు మూలం గురించి చెప్తూ...‘మళ్లీరావా’ తర్వాత ఏదైనా కొత్త నేపథ్యంలో సినిమా చేయాలనుకున్నా. సరిగ్గా సమయంలోనే సచిన్‌ గురించి హర్ష బోగ్లే ఇచ్చిన ఇంటర్వ్యూ చూశా.

ఈ దేశంలో చాలా మంది క్రికెటర్లు ఉన్నా, సచిన్‌ ఒక్కరే గొప్ప క్రికెటర్‌ కావడానికి వెనుక కారణాన్ని వెల్లడించారు. ఆ అంశం నన్ను ఆకర్షించింది. దానితోనే ఈ కథను అల్లుకున్నా. సచిన్‌ స్థాయిలో కష్టపడి అనేక కారణాల వల్ల వెలుగులోకి రాని ఎందరో ప్రతిభావంతుల జీవితాలు ఎవరికీ కనపడవు. ‘జెర్సీ’తో ఈ విషయాన్నే చెప్పా. అలాగని ఇది ఏ క్రికెటర్‌ జీవితాధారంగానో తెరకెక్కించిన చిత్రమైతే కాదు అన్నారు.