Asianet News TeluguAsianet News Telugu

దర్శక శిఖరం దాసరి"గురువుగారు" ఇకలేరు

  • దర్శక రత్న దాసరి నారాయణరావు కన్నుమూత
  • తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి పెద్దదిక్కుగా ఎనలేని కృషి చేసిన దాసరి
  • ప్రతి ఒక్కరూ గురువుగారూ అని ఆప్యాయంగా పిలుచుకునే దాసరి
  • ఎన్టీఆర్,ఎన్నార్,ఎస్వీఆర్ లాంటి నట దిగ్గజాలతో దాసరి సినిమాలు
  • దాసరి ప్రతిభకు దాసోహం అన్న ఎన్నో అవార్డులు రివార్డులు
director darshaka ratna dasari narayana rao no more deid of gastric problem

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు అనగానే ప్రతి నోటా వినిపించే ఒకే ఒక్క పేరు దర్శకరత్న దాసరి నారాయణ రావు. పరిశ్రమలో పనిచేసే ఎంతో మందిచేత గురువుగారూ అనిపించుకున్న దర్శక శిఖరం. పరిశ్రమలో పనిచేసే ఎంతో మంది తమకు ఏ కష్టం వచ్చినా... పెద్ద దిక్కు అనుకుంటూ.. దర్శకరత్న దాసరి దగ్గరికి వెళ్లగానే నేనున్నానంటూ అండగా నిలిచిన ఆజానుబాహుడు. ప్రపంచ సినీ చరిత్రలోనే శతాధిక చిత్రాల తొలి దర్శకుడిగా గిన్నిస్ రికార్డులకెక్కిన దర్శక రత్నం దాసరి నారాయణరావు. గురువుగారు అని అంతా ఆప్యాయంగా సంబోధించే దాసరి నారాయణరావు  దూర తీరాలకు వెళ్లిపోయారు. తెలుగు సినీ రంగానికి దాసరి అందించిన సేవలు వెలకట్టలేనివి. ఎంతో మంది కళాకారులను తయారు చేసిన ఘనత దాసరి నారాయణ రావుది. నాలుగున్న దశాబ్దాలుగా తెలుగు సినిమా పురోగతికి అవిశ్రాంతంగా కృషి చేసిన శ్రామికుడు. సమాజంలో సమస్యలపై సినిమాల ద్వారా బాణాలు సంధించిన సైనికుడు. తుది శ్వాస వరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికై తపించిన దార్శనికుడు దాసరి. ఆయన అనంత లోకాలకు వెళ్లినా... తెలుగు హృదయాల్లో చిరస్మరణీయుడు.

 

 

ఆయన దర్శకుడు మాత్రమే కాదు మాటల రచయిత, పాటల రచయిత కూడా. 150కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి సుమారు 250 చిత్రాలకు మాటలు, అనేక సినిమాల్లో పాటలు రాశారు. ఆయన నటుడుగా, నిర్మాతగా కూడా సేవలందించారు. ఒక్క తెలుగుకు మాత్రమే దాసరి పరిమితం కాలేదు. హిందీ,తమిళ, కన్నడ సినిమాల్లో నటునిగా మెరిశారు. మామగారు చిత్రంలో అమాయక మామగా నటించిన దాసరి ఆ చిత్రంలో చనిపోయినప్పుడు సీన్ కదిలించి వేస్తుంది.
 

దర్శకునిగా ‘తాతా మనవడు’ నుంచి మొదలుపెడితే తన చివరి చిత్రం ‘ఎర్ర బస్సు’ వరకు ఆయన దారి మార్చుకోలేదు. రెండు తరాల అగ్ర నటులతో పని చేశారాయన. ఎన్టీఆర్, ఏయన్నార్ ఎస్వీఆర్, కృష్ణలతో పాటు తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో సినిమాలు తీశారు. స్టార్‌ దర్శకునిగా పేరొచ్చిన తర్వాత కొత్త నటీనటులతో, తక్కువ నిర్మాణ వ్యయంలో సినిమాలు తీసి నిర్మాతల దర్శకునిగా ముద్ర వేసుకున్నారు. తొలి సినిమా ‘తాతా మనవడు’లో ‘అనుబంధం అత్మీయత అంతా ఓ బూటకం’ అంటూ కన్నకొడుకు నిరాదరణకు గురైన తల్లిదండ్రల ఆవేదనను హృద్యంగా ఆవిష్కరించారు.

 

స్వర్గం–నరకం, మేఘ సందేశం, కంటే కూతుర్నే కను వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆర్త్రత నింపిన దర్శకుడాయన. దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన... ‘తాండ్ర పాపారాయుడు‘, ‘బొబ్బిలి పులి‘, ‘సర్దార్‌ పాపారాయుడు‘ వంటి కమర్షియల్‌ సినిమాలతో గర్జించారు. ‘ప్రేమాభిషేకం‘, ‘మజ్ను‘ సినిమాల్లో భగ్న ప్రేమికుల హృదయ విలాపాన్ని ప్రేక్షకులకు చూపారు. ‘ఒసేయ్‌ రాములమ్మ’లో సమాజంలో అసమానతలను ఎత్తి చూపారు. దాసరి తీసిన ఆణిముత్యాల్లో ఇవి కొన్ని మాత్రమే. అమ్మ రాజీనామా’, ‘సూరిగాడు’ ఇలా హృదయానికి హత్తుకునే ఎన్నెన్నో గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారు దాసరి. తెలుగు సినీ దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన ఘనత ఒక్క దాసరి నారాయణ రావుకే చెల్లింది. ఆయన ప్రతిభకు మెచ్చి పలు అవార్డులు సలాం చేశాయి. రెండు జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను దాసరి అందుకున్నారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాక 53 చిత్రాలు స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. ఒకానొక సమయంలో దాసరి పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవంటే తెలుగు సినీ పరిశ్రమలో దాసరి స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

 

1942, మే4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్నించిన దాసరి అతి సామాన్య కుటుంబంలో జన్నించారు. బీఏ పట్టా పుచ్చుకున్న ఆయన బాల్యంలో నెలకు ఒక రూపాయి జీతానికి వడ్రంగి పని కూడా చేశారు. అయితే ఒక మాస్టారు సాయంతో మళ్ళీ చదువు కొనసాగించాడు.

సినీ రంగంలో ఎనలేని సేవలందించిన దాసరి రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన దాసరి రాజీవ్ హత్యానంతరం పార్టీకి దూరమై... 1990 దశకం చివరిలో తెలుగుతల్లి అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి విశేష స్పందన లభించింది. అనంతరం తిరిగి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్య సభ ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగానూ సేవలందించారాయన.

 

దాసరి అవార్డులు...

1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు

స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతి

1983లో మేఘసందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు

1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు గా నంది అవార్డు

1986లో తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్

దాసరి లేని లోటు తెలుగు సినీ పరిశ్రమలో మరెవ్వరూ పూడ్చలేనిది. విప్లవ భావజాలం ఉన్న దాసరి సమాజాన్ని జాగృతం చేసే ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. దొరలను ఎండగట్టిన రాములమ్మ తీసినా, నక్సలైట్ పాత్రలో అన్నగా నిలిచినా అది దాసరికే చెల్లింది. సమాజ జాగృతిని ఆకాంక్షించిన దాసరి తెలుగు సినీ పరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరం లాంటి వారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన.

Follow Us:
Download App:
  • android
  • ios