తమిళంలో నూతన దర్శకుడు రామ్ కుమార్ దర్శకత్వంలో 'రాచ్చసన్' సినిమా తెరకెక్కింది. విష్ణు విశాల్ - అమలాపాల్ జంటగా నటించిన ఈ సినిమా, అక్టోబర్ 5వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఐదు కోట్ల తో తీసిన ఈ సినిమా దాదాపు ముప్పై కోట్లు సంపాదించింది. 

దాంతో తెలుగువాళ్ల దృష్టీ ఈ సినిమాపై పడింది. రీమేక్ రైట్స్ ని హీరో నితిన్ సొంతం చేసుకున్నారు. కథ, కథనాలు, హీరో క్యారెక్టరైజేషన్‌ నచ్చడంతో ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నితిన్‌ నటించాలనుకుంటున్నారట.

సస్పెన్స్ తో సాగే సైకో థ్రిల్లర్ కథ ఇది. ఇందులో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు.  ఇప్పుడీ చిత్రాన్ని నితిన్ తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇంతవరకూ పోలీస్ ఆఫీసర్ గా చేయలేదు గనుక, ఆ పాత్రపై మనసు పారేసుకుని తెలుగు రీమేక్ లో ఆయనే చేయనున్నాడని అంటున్నారు. ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ కు సుథీర్ వర్మ డైరక్ట్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. 

ప్రస్తుతం నితిన్ తన తదుపరి చిత్రంగా 'భీష్మ' చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించనుంది. జనవరి 7వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.