స్టేజీ మీద..మైక్ చేతిలో ఉన్నప్పుడు  చాలా జాగ్రత్తగా, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే చాలా సమస్యలు వస్తూంటాయి. ముఖ్యంగా నలుగురుకి తెలిసిన పాపులర్ సెలబ్రెటీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి మాటలు ఇప్పుడున్న సోషల్ మీడియా రోజుల్లో వైరల్ అయ్యి, లేని పోని సమస్యలు తెచ్చిపెడతాయి. అదే ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్‌ నటుడు కే భాగ్యరాజా విషయంలో జరిగింది. స్త్రీలపై రేప్ లు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.  ఆడవాళ్లు ఎప్పుడు చూసినా  ఫోన్‌లో ఉంటున్నారు.. అదే దాడులకు, అత్యాచారాలకు కారణమవుతోందని నోరు జారి దొరికిపోయారు.

మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మహిళలు సెల్ప్ కంట్రోల్ కోల్పోయారని భాగ్యరాజా అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కరుతుకలై పాతివు సీ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ  వ్యాఖ్యలు  చేశారు.

భాగ్యరాజా మాట్లాడుతూ...మహిళలపై వేధింపులు, అత్యాచారం కేవలం  మహిళల అజాగ్రత్త వల్లే జరుగుతున్నాయి.  ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ చూసినా  ఫోన్‌లలోనే ఉంటున్నారు, రెండేసి ఫోన్‌లు, సిమ్‌లు వాడుతున్నారు. వారిపై అనేక ఘోరాలు జరగడానికి ఇది ఓ కారణం. మహిళలపై కట్టుదిట్టంగా రూల్స్  విధించినప్పుడు ఇలాంటి తప్పులేమీ జరగలేదు అని అన్నారు.

అలాగే తమిళనాట తీవ్ర సంచలనం రేపిన పొల్లాచ్చి సంఘటనపై స్పందిస్తూ ఇందులో మగవాళ్లు పైన మాత్రమే నిందలు వేయడం సరికాదని అన్నారు. అమ్మాయిలు చేసిన పొరపాటును వాళ్లు ఉపయోగించుకున్నారనీ, వారు అజాగ్రత్తగా ఉన్నందునే ఇలాంటి ఘటనలు జరుతున్నాయన్నారు.

అక్కడితో ఆగకుండా మగాళ్ల విచ్చలవిడి సంబంధాలను సమర్ధించు కొచ్చిన ఆయన ఒక పురుషుడు పొరపాటు చేస్తే, సరిద్దుకుంటాడు. అదే మహిళలు తప్పు చేస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అలాగే మగవాడికి చిన్నిల్లు (రెండవ భార్య) వుంటే ఆ స్త్రీ సంతోషంగా ఉంటుంది. ఆమెకు డబ్బు, ఆస్తి లభించడంతో పాటూ, మొదటి భార్యకు ఏ కష్టం కలగదు. కానీ ఒక మహిళకు సీక్రెట్ లవర్ వుంటే  భర్తల్ని, పిల్లల్ని చంపేస్తున్నారని అన్నారు.

ప్రతి రోజూ దినపత్రికల్లో వస్తున్న కేసులను ఈ సందర్భంగా ఉదాహరిస్తూ.. మహిళలు పరిమితుల్లో ఉండాలని సూచించారు. తాను జాయింట్ ఫ్యామిలీ నుండి వచ్చినందున, తన సినిమాల్లో మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చానని చెప్పుకొచ్చిన భాగ్యరాజా,  అత్యాచారాలకు మహిళలదే తప్పు అన్నారు.

ఈ కామెంట్స్ ఇప్పుడు తమిళ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ‘మీ టూ’ ఉద్యమంలో చెలరేగిన ఆరోపణలతో తమిళ చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. తాజాగా భాగ్యరాజ్‌ కామెంట్స్ మరింత దుమారాన్ని రేపనున్నాయి. భాగ్యరాజా మరి ఈ పొరపాటుని ఇలా సరిదిద్దుకుంటారో చూడాలి.