తమన్నా సినిమాకు నెగిటివ్ రివ్యూలు..కోర్టుకెళ్లిన నిర్మాతలు
సినిమా అనుకున్నట్లుగా వర్కవుట్ కాలేదు. అందుకు కారణం నెగిటివ్ రివ్యూలే అని వాటి వల్ల సినిమా కు తగిన కలెక్షన్స్ రాలేదని, కోర్టుకు ఎక్కారు.
సినిమాలపై రివ్యూలు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది పాజిటివ్ గానా,నెగిటివ్ గానా అనేది ఆ రిజల్ట్ ని బట్టి ఉంటుంది. చాలా సార్లు తమ సినిమాకు మంచి రివ్యూలు ఇచ్చినప్పుడు ఆనందపడే దర్శక,నిర్మాతలు అదే నెగిటివ్ రివ్యూలు ఇస్తే తట్టుకోలేరు. రివ్యూలపై ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయటం వంటివి చేస్తూంటారు. అయితే మళయాళ చిత్ర పరిశ్రమ మరో అడుగు ముందుకు వేసింది. తమన్నా ప్రధాన పాత్రలో చేసిన తాజా మలయాళ చిత్రం‘బాండ్రా’ పై రివ్యూల ప్రభావం తీవ్రంగా పడిందని కోర్టుకు వెళ్లారు. అయితే వెబ్ సైట్స్ మీదో న్యూస్ పేపర్ల లో వచ్చిన రివ్యూల మీద కాదు... నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన యూట్యూబర్లపై యాక్షన్ తీసుకోవాలని కోర్టుకెక్కింది టీమ్ . తప్పుడు రివ్యూలు ఇచ్చారంటూ ఆరోపణలు చేస్తూ ఏడుగురు యూట్యూబర్లపై యాక్షన్ తీసుకోవాలని ‘బాండ్రా’ మూవీ టీమ్ కోరింది. వివరాల్లోకి వెళితే..
అరుణ్ గోపీ దర్శకత్వంలో దిలీప్ నటించిన మలయాళ చిత్రం ‘బాండ్రా’ (Bandra) రీసెంట్ గా రిలీజైంది. ఎప్పటిలాగే అన్ని చోట్లా రివ్యూలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు ఏడుగురు యూట్యూబర్లు మరీ దారుణంగా రివ్యూలు ఇచ్చారు. వాటి ఇంపాక్ట్ తమ సినిమా రిజల్ట్ పై పడిందని నిర్మాత భావించారు. దాంతో తప్పుడు రివ్యూలు ఇచ్చారంటూ ‘బాండ్రా’ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ అజిత్ వినాయక ఫిల్మ్స్.. తిరువనంతపురంలోని కోర్టుకు ఆశ్రయించింది. వారిచ్చిన రిపోర్టులో అశ్వంత్ కాక్, షిహాబ్, ఉన్ని వ్లాగ్స్, షాహ్ మహమ్మద్, అర్జున్, షిజాస్ టాక్స్, సాయి కృష్ణన్ వంటి ఏడుగురు యూట్యూబర్లు, వాటి యూట్యూబ్ ఛానెళ్ల పేర్లు ఉన్నాయి. వీరు ఇచ్చిన తప్పుడు రివ్యూల వల్లే సినిమాకు నష్టాలు వచ్చాయని కూడా ప్రొడక్షన్ సంస్థ రిపోర్టులో పేర్కొనటం విశేషం. ఆ పిటీషన్ లో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించాలని కావాలనే ఈ యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు రివ్యూలను ఇచ్చాయని తెలిపింది.
ఇక ‘రామలీల’చిత్రం తర్వాత దర్శకుడు అరుణ్ గోపీ, హీరో దిలీప్ ‘బాండ్రా’తో మరోసారి చేయి కలిపారు. శరత్ కుమార్, తమన్నా, డినో మోరియా, కళాభవన్ షాజన్, గణేశ్ కుమార్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించారు. అయితే సినిమా అనుకున్నట్లుగా వర్కవుట్ కాలేదు. అందుకు కారణం నెగిటివ్ రివ్యూలే అని వాటి వల్ల ‘బాండ్రా’కు తగిన కలెక్షన్స్ రాలేదని, కొందరు కావాలనే ఇలాంటి రివ్యూలను వ్యాప్తి చేశారని మూవీ టీమ్ మీడియా ముందు ఆక్రోశం వ్యక్తం చేసింది. కోర్టుకు ఎక్కింది. ఇక తమన్నాకు మలయాళంలో తొలి చిత్రం. ఈ సినిమాపై తమన్నా సైతం ఎన్నో ఆశలు పెట్టుకుంది.