దిల్ రాజు చెయ్యపడితే అది రాంగై పోదులేరా అని ప్రేక్షకులు ఫిక్సై థియోటర్స్ దగ్గర క్యూ కడతారు. అలా ఉంటాయి ఆయన లెక్కలు. ఓ సినిమాని ఆయన నిర్మించినా, డిస్ట్రిబ్యూషన్ కు తీసుకున్నా ట్రేడ్ లో అంచనాలు పెరిగిపోతాయి. రాత్రికు రాత్రి లెక్కలు తారు మారైపోతాయి. ఇప్పుడు రవిబాబు చిత్రం  ‘ఆవిరి’ ని దిల్ రాజు టేకప్ చేస్తున్నారు. దాంతో ఆ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యిపోయింది. ఎంతో కొంత విషయం లేకపోతే దిల్ రాజు ఎందుకు తీసుకుంటారని అంటున్నారు.

విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు  చాలా కాలం క్రితం అంటే జనవరిలో నూతన సంవత్సర కానుకగా తన కొత్త సినిమాని ప్రకటించారు. ఓ చిన్న పందిపిల్లతో ‘అదుగో’ సినిమాతో ముందుకొచ్చి ప్రేక్షకులను నిరాశపర్చిన దర్శకుడు, నటుడు రవిబాబు మరో కొత్త ప్రయోగానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి ‘ఆవిరి’ అనే టైటిల్‌ని ప్రకటించారాయన. అంతేకాదు.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్రం కాన్సెప్ట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.  

గాజు సీసా లోపల అమ్మాయి ఉండటం.. ఆ సీసా మూతని ఎవరో ఓపెన్‌ చేస్తుంటే ఆవిర్లు బయటికి వస్తుండటం.. వంటి వాటితో విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్‌ ఆకట్టుకుంది. ‘‘ఇది ఒక ఆఫ్‌ బీట్‌ చిత్రం. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను, నటీనటులను ప్రకటిస్తాం’’ అని చెప్పిన రవిబాబు సైలెంట్ అయ్యిపోయారు.  అయితే ఇప్పుడా సినిమా షూటింగ్ పూర్తై పోయిందని సమాచారం. దిల్ రాజు కు సినిమా చూపించారని, ఆయన కు కాన్సెప్టు నచ్చి రిలీజ్ చేయటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు.