సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతుంటారు. రీసెంట్ గా 'మహర్షి' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు మహేష్. ఈ సినిమాకి వంద కోట్ల షేర్ వచ్చినా కానీ నిర్మాతలకు పెద్దగా మిగిలిందేమీ లేదని తెలుస్తోంది. మహేష్ బాబు రెమ్యునరేషన్, దర్శకుడు వంశీ 
పైడిపల్లి చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చుపెట్టడంతో.. నిర్మాతలు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే చాలని అనుకునే పరిస్థితి ఏర్పడింది. 

అయితే రిలీజ్ ప్లానింగ్, బిజినెస్ వ్యవహారాలను దిల్ రాజు బాగా డీల్ చేయడంతో తన తదుపరి సినిమా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా ఉండాలని మహేష్ పట్టుబట్టాడు. దీంతో దిల్ రాజు సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నారు. అయితే హీరోగా మహేష్ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం దిల్ రాజు హ్యాపీ లేడని మాటలు వినిపిస్తున్నాయి.

'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి మహేష్ వాటాగా యాభై కోట్లు పైగానే వెళ్తుందని సమాచారం. హీరోనే అంత తీసుకుంటున్నప్పుడు.. ఇక సినిమా బడ్జెట్, ఇతర వ్యవహారాలు అలా చూసుకుంటే చివరకి నిర్మాతకి ఏం మిగులుతుంది..? దిల్ రాజు కూడా ఇదే ఆలోచిస్తున్నాడని ఆయన మాటలను బట్టి అర్ధమవుతోంది.

తాజాగా ఆయన మహేష్ పేరు ప్రస్తావించకపోయినా..కానీ బాలీవుడ్ హీరోల తరహాలో ఇక్కడి స్టార్ హీరోలు కూడా లాభాల్లో వాటా మాత్రమే తీసుకోవాలని.. తద్వారా నిర్మాతపై భారం తగ్గడమే కాకుండా మరింత మంచి నిర్మాతలు ఫీల్డ్ లో ఉంటారని.. ఎక్కువసినిమాలు రూపొందుతాయని అన్నారు దిల్ రాజు. మరో రెండు, మూడేళ్లలో అయినా ఈ పద్దతి రావాలని కోరుకున్నారు.