ఈ ఏడాది నందమూరి బాలకృష్ణకు అంతగా కలసి రాలేదు. ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో వాస్తవాలు చూపించేలేదనే విమర్శలు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఎన్నికల్లో టిడిపి ఓటమి చెందింది. హిందూపురం నుంచి బాలయ్య విజయం సాధించడం ఊరటనిచ్చే అంశం. 

ఇదిలా ఉండగా బాలకృష్ణ త్వరలో సినిమాలతో బిజీ కానున్నాడు. ప్రస్తుతం బాలయ్య కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. సి కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం అవుతుందట. ఇక క్రేజీ దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్యతో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కించేందుకు సిద్ధం ప్రయత్నిస్తున్నాడు. వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య బోయపాటి దర్శకత్వంలోనే నటించాలనుకున్నాడు. కానీ అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. 

బోయపాటి, బాలయ్య చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యారట. అంటే దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత దిల్ రాజు, బోయపాటి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. గతంలో బోయపాటి తెరకెక్కించిన భద్ర చిత్రానికి దిల్ రాజే నిర్మాత. ఆసక్తి రేపుతున్న ఈ కాంబినేషన్ గురించి త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.