ఖండించిన దిల్ రాజు, ఆ సంగతి ఏంటో తేల్చమంటున్న జనం
దిల్‌రాజు ఓటీటీ ఫ్లాట్‌ఫాంను తీసుకొస్తున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. నిర్ధారణ కాని వార్తలను దయ చేసి ఎవరూ ప్రచురించవద్దు

వెబ్ మీడియా,సోషల్ మీడియాలో వచ్చే వార్తలను సాధారణంగా లైట్ తీసుకుంటారు దర్శక,నిర్మాతలు. అయితే దాని వల్ల ఏదన్నా సమస్యలు వస్తాయనుకుంటే మాత్రం వెంటనే ఖండన రిలీజ్ చేస్తూంటారు. అలాగే ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju)కూడా తనపై వచ్చిన ఓ వార్తలు ఖండిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అయితే ఆ వార్త ఖండన కన్నా ఆయన్ని టార్గెట్ చేస్తూ జనం ఆడేసుకోవటం మొదలెట్టారు. ఎందుకు..ఏమిటో చూద్దాం.
దిల్ రాజు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారంటూ కొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. రూ.5కోట్లలోగా బడ్జెట్‌తో దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించి వాటిని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది. ఇది 2024లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఒకవేళ ఇదే నిజమైతే ఆయన నిర్మించే సినిమాలతో పాటు.. డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలు కూడా అందులోనే విడుదలయ్యే అవకాశముందని కథనాలు వచ్చాయి.
ఈ వార్తలను దిల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఖండించింది. నిర్ధారణ కాకుండా వార్తలను ప్రచురించవద్దని కోరింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ‘‘మా నిర్మాత దిల్‌రాజు ఓటీటీ ఫ్లాట్‌ఫాంను తీసుకొస్తున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. నిర్ధారణ కాని వార్తలను దయ చేసి ఎవరూ ప్రచురించవద్దు’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ (ట్విటర్)లో పేర్కొంది.
— Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2023
ఇక ఈ ఖండన రాగానే ...క్రింద కామెంట్స్ మొదలయ్యాయి. మొదట రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ అప్డేట్స్ ఇవ్వడంటూ జనం కామెట్స్ తో ఆడుకోవటం మొదలెట్టారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికే ఈ చిత్రం ఎన్నో సార్లు వాయిదా వేసుకుంటూ షూటింగ్ జరుపుకుంటోంది. అసలీ చిత్రం ప్రకటించి చాలా కాలం అయినప్పటికీ కనీసం ఒక్క అప్డేట్ కూడా రాలేదు.
దీంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న రామ్ చరణ్ అభిమానులు నిరాశ పడుతున్నారు. వీటిన్నింటికీ కారణం ఈ చిత్ర దర్శకుడు శంకర్ రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణం చేయడమే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సాఫీగా సాగుతున్న 'గేమ్ ఛేంజర్' షూటింగ్ మధ్యలో కమల్ హాసన్ 'ఇండియన్ 2'ను తీసుకొచ్చి చిత్రీకరణ ప్రారంభించారు. దీంతో 'గేమ్ ఛేంజర్' ఆలస్యం అవుతూ.. బడ్జెట్ పెరిగిపోతూ వెళ్తోంది. 'ఇండియన్ 2'పై టీజర్ తో క్లారిటీ వస్తున్నప్పటికీ.. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందో మాత్రం స్పష్టత రావట్లేదు.