దిల్ రాజు లెక్కేవేరు...అందుకే అంత రేటు పెట్టి కొన్నాడు
చాక్లెట్ బాయ్ లాంటి రణ్‌బీర్‌ను వైల్డ్‌గా చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు సందీప్ వంగ.

దిల్ రాజు ఏం చేసినా అది హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఓ ప్రక్కన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతూనే మరోపక్క సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా మరో భారీ సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు యానిమల్. తెలుగు దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ ,రష్మిక కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సొంతం చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు ఇప్పటికే చిత్రం టీజర్, మరికొంత ప్రమోషన్ మెటీరియల్ చూసి ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం.
ఈసినిమా తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోవడంతో సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం తెలుగు రైట్స్ 15 కోట్లకు అమ్మారని తెలుస్తోంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రంకి డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ లో బజ్ స్టార్టైంది. సినిమా మీద కన్నా దిల్ రాజు ఓకే చేశాడంటే సినిమాలో మ్యాటర్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది అన్న నమ్మకమే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలవటానకి కారణమైంది. ఇప్పుడు అందరి దృష్టీ సెప్టెంబర్ 28 న విడుదల కానున్న చిత్రం టీజర్ పైనే ఉంది.
ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ద్వారా ..ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ మూవీ అనే క్లారిటీ వచ్చేసింది.అయితే.. అసలు ఈ సినిమా కథేంటి? ఎలాంటి బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతుంది? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. మీడియా టాక్ ప్రకారం.. యానిమల్ సినిమా తండ్రీకొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో ఉండబోతుందట. అర్జున్ రెడ్డిలో లవ్ స్టోరీతో దుమ్ము రేపిన సందీప్ రెడ్డి.. ఈసారి తండ్రి కొడుకుల బాండింగ్‌ను మరింత పవర్ ఫుల్‌గా చూపించబోతున్నాడట.
యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నాడు. బాబీ డియోల్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రి కొడుకు మధ్య ఎమోషన్.. పీక్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి సబ్జెక్ట్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై చూడని విధంగా యానిమల్ ఉంటుందట. దాంతో యానిమల్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ పక్కా రివెంజ్ స్టొరీ అని తెలుస్తుంది. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.