హీరోల కుటుంబాల నుంచి వచ్చేవారిని లాంచ్ చేస్తూ హిట్స్ ఇస్తున్న నిర్మాతలకు ఆ మధ్యన ఓ ఆలోచన వచ్చింది. ఆ పెట్టుబడి ఏదో  తమ పిల్లలను హీరోలను చేయటం మీద పెడితే , చేతిలో హీరో ఉంటాడు అనే నిర్ణయానికి వచ్చారు. తెలుగులోనూ కొందరు నిర్మాతలు అమలుపరిచి తమ పిల్లలను ఇండస్ట్రీలో నిలబెడుతున్నారు. అయితే అందరి కొడుకులు హీరోలు అయ్యే మెటీరియల్ గా ఉండరు. అలాగే కొందరికి మగ పిల్లలకే ఉండకపోవచ్చు. అప్పుడు తమ కుటుంబాలలో పిల్లలను సైతం రంగంలోకి తీసుకువస్తున్నారు. దిల్ రాజు సైతం ఇప్పుడు అదే చేయబోతున్నట్లు సమాచారం. 

ఆయన తన సోదరుడు, పార్టనర్ శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డిని హీరోగా లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు సన్నాహాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ఆశిష్ రెడ్డి ఇప్పటికే ..వైజాగ్ సత్యానంద్ ఇనిస్టిట్యూట్ లో నటనకు చెందిన కోర్స్ పూర్తి చేసి వచ్చారు. 

వాస్తవానికి ఈ కుర్రాడిని దసరాకే లాంచ్ చేయాలి. డైరక్టర్ ఎంపిక,స్క్రిప్టు వర్క్ పూర్తైంది. అయితే అనుకోని విధంగా శిరీష్ రెడ్డి  తండ్రి మరణించటంతో ప్రాజెక్ట్ ని వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే సంవత్సరం మార్చి నుంచి ఈ సినిమా ఉండే అవకాసం ఉంది. సతీష్ అనే కొత్త దర్శకుడు తో ఈ సినిమా చేయబోతున్నారు. ఓ కొత్త తరహా కధాంశంతో ఫ్యామిలీలకు దగ్గరయ్యే కథతో ఈ సినిమా ఉండబోతోంది. 

మరో ప్రక్క మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ని సైతం దిల్ రాజు లాంచ్ చేస్తున్నారు. ఈ మేరకు రీసెంట్ గా పూజ కూడా జరిగింది. దిల్ రాజు వంటి నిర్మాత చేతిలో పెడితే తమ పిల్లల లాంచింగ్ బాగుంటుందని, వారి భవిష్యత్ ఇండస్ట్రీలో ఉంటుందని చాలా మంది భావించటంతో ఆయన దగ్గరకు నెలకు ఒకటైనా అలాంటి ఆఫర్ వస్తోందట.