తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యాజమాన్య సమస్యలు, వివాదంపై  నిర్మాతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఈ వివాదంలో తమ పాత్రలపై వస్తున్న ఆరోపణలపై స్పష్టతనిస్తున్నారు. ఇక  ఈ విషయంలో తాజాగా కౌంటర్ ట్వీట్ చేశారు నిర్మాత , నటుడు బండ్ల గణేష్.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యాజమాన్య సమస్యలు, బంద్‌ ప్రకటనల నేపథ్యంలో నెలకొన్న వివాదంపై ప్రముఖ నిర్మాతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఈ వివాదంలో తమ పాత్రలపై వస్తున్న ఆరోపణలపై స్పష్టతనిస్తూ వారు మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. ఈ విషయంలో తాజాగా కౌంటర్ ట్వీట్ చేశారు నిర్మాత , నటుడు బండ్ల గణేష్.

ఫిల్మ్ ఇండస్ట్రీపై పవన్ కళ్యాణ్ కామెంట్స్ తరువాత, ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. తాజాగా నిర్మాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ, "తెలంగాణలో నాకు కేవలం 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 370 థియేటర్లలో మేము—ఏషియన్ సునీల్, సురేష్ బాబు, నేనూ కలిపి—కేవలం 120 థియేటర్లను మాత్రమే నిర్వహిస్తున్నాం" అని వెల్లడించారు.

ఇంతే కాకుండా, పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేంత ధైర్యం, దమ్ము ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. "ఇప్పటికే థియేటర్ల వివాదం సద్దుమణిగింది. ఈ పరిష్కారానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ ఆయన అన్నారు.

ఇంతలోనే, దిల్ రాజు మీడియా సమావేశం జరుగుతున్న సమయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. "ఆస్కార్ నటులు, కమలహాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం" అంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారన్నది తెలియనప్పటికీ, దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ఈ కామెంట్లు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఈ వ్యాఖ్యలు దిల్ రాజును ఉద్దేశించే అని అనుమానిస్తున్నారు.

ఇక ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా మీడియా సమావేశం పెట్టారు. అందులో ఆయన మాట్లాడుతూ, "తనకు తెలంగాణలో ఒక్క థియేటర్, ఆంధ్రప్రదేశ్‌లో 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయ్. పరిశ్రమలో 'ఆ నలుగురు' ప్రచారంలో తాను లేను" అని అన్నారు. ఇక ముందు కూడా ఆ థియేటర్లు రెన్యూవల్ చేయడంలేదని కూడా తేల్చేశారు.

ఈ ఘటనలతో ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల సమస్యలు, రకరకాల ఆరోపణలు, రాజకీయ జోక్యంపై పెద్ద చర్చ జరుగుతుంది. సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధం ఎలా ముగుస్తుందన్నదే ఇప్పుడు సినీ ప్రేమికులకు ఆసక్తికరమైన అంశంగా మారింది. అంతే కాదు సినిమా పెద్దలు ఏపి సీఎం ను కలవకపోవడం కూడా ఈ పెద్ద ఇష్యూగా మారింది.