దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకుడిగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ వకీల్ సాబ్. కమ్ బ్యాక్ మూవీ కావడంతో దిల్ రాజు పవన్ కళ్యాణ్ కి భారీ పారితోషికం కూడా ఇచ్చారు. పవన్ నుండి రెండేళ్ల తరువాత వస్తున్న మూవీ కాబట్టి ఓపెనింగ్స్ తోనే పెట్టుబడి రాబట్టుకోవచ్చు అనేది ఆయన ఆలోచన అయ్యుండొచ్చు. నిజంగా అది ఖచ్చితమైన అంచనానే అని చెప్పాలి. టాక్ తో సంబంధం లేకుండా పవన్ మూవీకి ఫ్యాన్స్ పోటెత్తుతారు. దీనితో ఏ విధంగా చూసినా దిల్ రాజు వకీల్ సాబ్ మూవీ తనకు భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని నమ్మారు. కానీ ఆయన ప్రణాళిక కరోనా ఎంట్రీతో తారుమారు అయ్యింది. చివరి వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. మే లో విడుదల కావాల్సిన ఈ చిత్రం నాలుగు నెలలుగా విడుదల కోసం వేచి చూస్తుంది.

 కాగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన మరొక చిత్రం 'వి' కి అమెజాన్ ప్రైమ్ ఓ ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వడంతో, ఇన్నాళ్లు మడిగట్టుకు కూర్చున్న దిల్ రాజు ఓ టి టిలో విడుద చేస్తున్నాడు.ఈ చిత్ర  హీరో నాని వి థియేటర్స్ లో విడుదల కావాలని కోరుకున్నారు. సినిమా పెట్టుబడి నెలల తరబడి స్థంభించి పోవడంతో వడ్డీల భారం తట్టుకోలేక దిల్ రాజు ఓ టి టి డీల్ ఓకే చేశారు. వి మూవీతో పోలిస్తే రెట్టింపు పెట్టుబడి వకీల్ సాబ్ మూవీ వలన ఫ్రీజ్ అయ్యింది. దీనితో దిల్ రాజు వకీల్ సాబ్ ను కూడా ఓ టి టి లో విడుదల చేసే అవకాశం లేకపోలేదు. 

కేవలం 20రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో వకీల్ సాబ్ షూటింగ్ దిల్ రాజు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఓ పాట మరియు కోర్ట్ రూమ్ సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సింది ఉండగా, పరిమితులు మరియు భద్రతల మధ్య షూటింగ్ పూర్తి చేసి వకీల్ సాబ్ మూవీ కూడా ఓ టి టి లో విడుదల చేసే ఆలోచన దిల్ రాజు చేయవచ్చు. ఐతే పవన్ ఫ్యాన్స్ కి ఇది ససేమిరా ఇష్టం లేదు. తమ అభిమాన హీరోను బిగ్ స్క్రీన్ పై చూసి పండగ చేసుకోవాలని వారు కోరుకుంటున్నారు. కాగా దిల్ రాజు నిర్ణయం ఏమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.