Asianet News TeluguAsianet News Telugu

అన్నంత పని చేసిన దిల్ రాజు... చిరంజీవి, బాలకృష్ణలకు బిగ్  షాక్ 

సంక్రాంతి చిత్రాల థియేటర్స్ పంపకాల విషయంలో వివాదం నెలకొంది. దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వారసుడు కోసం థియేటర్స్ లాక్ చేశాడని ప్రచారం జరుగుతుండగా... తాజా పరిస్థితులు దాన్ని నిరూపిస్తున్నాయి. 
 

dil raju locks major theaters for varasudu shock to chiranjeevi and balakrishna
Author
First Published Jan 2, 2023, 10:31 AM IST


గత రెండు నెలలుగా దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్ అన్నట్లు నడుస్తుంది. సంక్రాంతి చిత్రాల విడుదల, థియేటర్స్ పంపకాల విషయంలో వివాదం నెలకొంది. డబ్బింగ్ మూవీ వారసుడు చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయకూడదంటూ టాలీవుడ్ నిర్మాతల మండలి తీర్మానం చేసింది. వారసుడు నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఈ నిర్ణయంపై ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే తెర వెనుక కథ నడిపి వారసుడు సంక్రాంతి బరిలో నిలిచేలా చేశాడు. వారసుడు విడుదల తెలుగు రాష్ట్రాల్లో ఆపితే తమిళనాడులో తెలుగు చిత్రాల విడుదల అడ్డుకుంటామని కోలీవుడ్ వర్గాలు హెచ్చరించాయి. 

వారసుడు విడుదల ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ ని దారుణంగా దెబ్బతీయాలని దిల్ రాజు స్కెచ్ వేశాడనేది మరొక ఆరోపణ. ఏపీ, తెలంగాణాలలో పెద్ద మొత్తంలో వారసుడు కోసం దిల్ రాజు థియేటర్స్ లాక్ చేశాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. దానికి ఆయన చెబుతున్న సమాధానం... నా థియేటర్లో నా సినిమా వేసుకోవద్దా అని. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజుకు 70 థియేటర్స్ వరకూ ఉన్నాయి. వీటితో పాటు బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ తో  సన్నిహిత సంబంధాలున్న దిల్ రాజు మరిన్ని థియేటర్స్ లాక్ చేసి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలకు దక్కకుండా చేయాలనే ప్లాన్ చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. 

పరిస్థితులు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సంక్రాంతి దగ్గరపడుతుండగా... చిత్రాల థియేటర్స్ లిస్ట్ బయటకు వస్తుంది. ఉత్తరాంధ్ర గుండెకాయ వైజాగ్ లో మేజర్ థియేటర్స్ వారసుడు చిత్రానికి దక్కాయి. సంగం, మెలోడీ థియేటర్స్ వారసుడు చిత్రానికి కేటాయించారు. ఇవి మేజర్ రెవెన్యూ ఇచ్చే థియేటర్స్ గా ఉన్నాయి. ఇక వాల్తేరు వీరయ్యకు జగదాంబా థియేటర్ దక్కింది. బాలకృష్ణకు పూర్తిగా అన్యాయం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. వీరసింహారెడ్డి మూవీకి అధిక రెవెన్యూ, కెపాసిటీ ఉన్న ఒక్క థియేటర్ మాత్రమే లభించినట్లు సమాచారం. 

ఎప్పటి నుండో అనుకుంటున్నట్లే యాభై శాతం థియేటర్స్ వారసుడికి మిగిలిన యాభై శాతం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు దక్కనున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కలెక్షన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. టికెట్స్ లభించని వారు పండగ రోజూ ఏదో ఒక సినిమా చూడాలి అనుకుంటారు కాబట్టి... చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల ఓవర్ ఫ్లో వారసుడు చిత్రానికి దక్కవచ్చు. మొత్తంగా దిల్ రాజు తాను అనుకున్న ప్రణాళిక విజయవంతంగా అమలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios