ఒకరిపై మరొకరు అవాకులు చవాకులు పేల్చుకున్న దర్శకుడు హరీష్-నిర్మాత బండ్ల గణేష్ మిత్రులుగా మారడం విశేషంగా మారింది. బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ కి ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చి నేపథ్యంలో... వారి మధ్య జరిగిన వివాదంపై  స్పందించారు. 

2012 మే 11న విడుదలైన గబ్బర్ సింగ్ (Gabbar Singh) 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ కొన్ని ఎమోషనల్ ట్వీట్స్ చేశారు. హీరో పవన్ కళ్యాణ్ పై భక్తి కురిపించాడు. అదే సమయంలో గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కి ఓ బహుమతి అందించారు. ఖరీదైన రిస్ట్ వాచ్ బహుమతిగా ఇచ్చి అభిమానం చాటుకున్నారు. ఇక బండ్ల గణేష్ తనకు బహుమతి ఇవ్వడం పట్ల హరీష్ స్పందించారు.నాకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నిర్మాత బండ్ల గణేష్ కి ధన్యవాదాలు అంటూ తెలిపారు. నీ సహకారం లేకపోతే గబ్బర్ సింగ్ అంత త్వరగా అయ్యేది కాదంటూ కృతజ్ఞతలు తెలిపాడు. 

అయితే ఇదే మూవీ విషయమై గతంలో బండ్ల గణేష్(Bandla Ganesh), హరీష్ శంకర్ గొడవపడ్డారు. గబ్బర్ సింగ్ యానివర్సరీ నేపథ్యంలో చిత్ర యూనిట్ అందరికీ కృతజ్ఞతలు తెలిపిన హరీష్ శంకర్ నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. దీనికి హర్ట్ అయిన బండ్ల గణేష్ పరోక్షంగా హరీష్ పై సెటైర్లు వేశాడు. హరీష్ కూడా తగ్గకుండా కౌంటర్లు వేయడం జరిగింది. ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ జరుగగా.. మెల్లగా చల్లబడ్డారు. 10వ యానివర్సరీకి మాత్రం బండ్ల గణేష్ దర్శకుడు హరీష్ శంకర్ కి బహుమతి ఇవ్వడం, హరీష్ కృతజ్ఞతలు తెలపడం ఆసక్తికరంగా మారింది. 

ఇదే విషయమై బండ్ల గణేష్ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. గతంలో హరీష్ (Harish Shankar)మీరు గొడవపడ్డారు, ఇప్పుడేమో మిత్రులైపోయారని అడుగగా..ప్రతి రిలేషన్ లో మనస్పర్థలు ఉంటాయి. అంత మాత్రాన శాశ్వతంగా దూరం కాలేం కదా. గబ్బర్ సింగ్ నా జీవితాన్నే మార్చేసిన చిత్రం. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ కి నేను ఎప్పటికీ కృతజ్ఞతలు కలిగి ఉంటాను. హరీష్-పవన్ కాంబినేషన్ లో మరలా మూవీ చేసే అవకాశం వస్తే నిర్మిస్తాను.. అంటూ తెలియజేశారు. కాగా హరీష్ శంకర్ హీరో పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించారు. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 

కాగా ఈ మధ్య పవన్ (Pawan Kalyan)తో బండ్ల గణేష్ కి చెడినట్లు వార్తలు వస్తున్నాయి. భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ వేడుకకు ముందు బండ్ల మాట్లాడిన ఓ ఫోన్ కాల్ లీకైంది. ఆ కాల్ లో బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పవన్ భక్తుడు బండ్ల గణేష్ ని దగ్గరకు రానివ్వడం లేదనే ప్రచారం ఉంది. ఆ ఆడియో కాల్ మాట్లాడింది నేను కాదని బండ్ల గణేష్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ... వివాదమైతే అలానే ఉందట. ఈ మధ్య కాలంలో బండ్ల పవన్ ని కలిసిన దాఖలాలు లేవు.