ఓ సినిమాకు నిర్మాత ఒకరైతే ఎలాంటి సమస్య ఉండదూ.. నష్టమోచ్చినా.. లాభామోచ్చినా ఆ నిర్మాతే చూసుకుంటాడు. అలా కాకుండా ఇద్దరు, ముగ్గురు నిర్మాతలు కలిసి పని చేస్తే డబ్బులు మేటర్ కాబట్టి ఎక్కడో దగ్గర గొడవలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు 'మహర్షి' సినిమాకు ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని సమాచారం. ఈ సినిమాకు పేరున్న ముగ్గురు నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్, పివిపిలు పని చేశారు.

ఇప్పుడు వీరిమధ్య పంచాయితీ ఒకటి నడుస్తుందని ఇన్సైడ్ టాక్. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే.. అశ్వనీదత్ ఆయన నిర్మించిన 'దేవదాసు' తాలూకు బకాయిలు నైజాం డిస్ట్రిబ్యూటర్ సునీల్ కి కోటి అరవై లక్షల వరకు చెల్లించాల్సివుందట. కానీ ఇప్పటివరకు సెటిల్మెంట్ జరగలేదు. దీంతో ఇప్పుడు 'మహర్షి'బిజినెస్ లో దాన్ని అడ్జస్ట్ చేయమని సునీల్ అడిగినట్లు సమాచారం. 

దీనికి మిగిలిన ఇద్దరు నిర్మాతలు దిల్ రాజు, పివిపిల నుండి వ్యతిరేకత వచ్చిందట. దీంతో అశ్వనీదత్ ఓవైపు, దిల్ రాజు-పివిపిలు మరోవైపు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా 'మహర్షి' సినిమా నూట యాభై కోట్ల బిజినెస్ చేసినప్పుడు సునీల్ కి ఇవ్వాల్సిన చిన్న మొత్తం అడ్జస్ట్ చేయలేరా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం చివరకు లాయర్ వరకూ వెళ్లిందట.

సినిమా రిలీజ్ దగ్గరలో పెట్టుకొని ఇలాంటి సమయంలో గొడవలు కరెక్ట్ కాదని అశ్వనీదత్ కూతురు స్వప్నాదత్ రంగంలోకి దిగి సునీల్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోందట. అయితే దిల్ రాజు ఇలా కాదని ముగ్గురం కూర్చొని వాటాలకు సంబంధించి ఓ నిర్ణయానికి వద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. మరి సైలెంట్ గా ఈ విషయాన్ని సద్దుమణిగేలా చేస్తారేమో చూడాలి!