టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఓ భారీ బడ్జెట్ సినిమా నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కంటిన్యూ అవుతోన్న కాజల్ కి ఈ మధ్య కాలంలో సక్సెస్ లు బాగా తగ్గాయి. తెలుగులో అయితే వరుసగా ఫ్లాప్ సినిమాలు అందుకుంటున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం సరైన అవకాశాలు లేవు. ఇటీవల ఈమెకు 'ఇండియన్ 2' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ సినిమా కావడంతో ఈ సినిమాపై కాజల్ చాలా ఆశలు పెట్టుకుంది. తన కెరీర్ లో ఇదొక మైలు రాయిగా నిలిచిపోతుందని భావించింది. సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. కాజల్ సినిమాకి సంబంధించిన ఫోటోషూట్ లో కూడా పాల్గొంది. అయితే కమల్ లోక్ సభ ఎన్నికల్లో బిజీ కావడంతో సినిమా నిర్మాణం వాయిదా పడిందనే ప్రచారం జరిగింది.

ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన వివరాలు తెలియడం లేదు. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తరువాత కమల్ 'బిగ్ బాస్ 3'పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ షో కోసం మరో మూడు నెలల్లో వారానికి రెండు రోజుల చొప్పున సమయం కేటాయించనున్నారు. దీంతో ఆయన 'ఇండియన్ 2' సినిమా కోసం ఇప్పట్లో ఆలోచించేలా కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన కాజల్ ఓపిక నశించి ఈ ప్రాజెక్ట్ కి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందట. ఈ సినిమాతో తను మళ్లీ బిజీ అవుతాననుకుంటే కనీసం సినిమా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో చాలా బాధ పడుతున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'క్వీన్' తమిళ రీమేక్ 'పారిస్ పారిస్' విడుదలకు సిద్ధమవుతోంది.