ఇప్పటివరకు నాకు రావాల్సిన డబ్బులు అందలేదు. అంతేకాదు, నా పాత్రకుగానూ వేరే వ్యక్తితో డబ్బింగ్‌ చెప్పించారు. ఇలా చేయడం నాతో చేసుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించడమే

దర్శక,నిర్మాత అబిషేక్ నామా స్వీయదర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మించిన డెవిల్ చిత్రంలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా విభిన్నమైన రోల్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. అదీ భారీ బడ్జెట్ తో. పీరియాడిక్ స్పై ధ్రిల్లర్ గా వస్తున్న డెవిల్ చిత్రం భారీ అంచనాల నేపథ్యంలో డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేస్తున్నారు. ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేధించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాని మొదటి నుంచి వివాదాలు చుట్టూ ముడుతూ ఉన్నాయి. తాజాగా మరో వివాదం వచ్చింది.

మొదట ‘బాబు బాగా బిజీ’ అనే సినిమా తీసిన నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ మూవీ అనౌన్స్ అయ్యింది. కళ్యాణ్ రామ్ హీరోగా డెవిల్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు.. దర్శకుడుగా నవీన్ పేరు.. దర్శకత్వ పర్యవేక్షణగా అభిషేక్ పిక్చర్స్ పేరుంది. ఈ సినిమాకు కథా రచయితగా శ్రీకాంత్ విస్సా, డైరెక్టర్ గా నవీన్ మేడారంలతో సినిమా స్టార్ట్ అయ్యింది. కథతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఇద్దరు కలిసి చూసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో గానీ కొద్దిరోజులకు స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గా నవీన్ పేరు వేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు స్క్రీన్ ప్లే కూడా పోయి.. కేవలం డైరెక్టర్ గా నవీన్ పేరు వేశారు. ఇప్పుడు డైరెక్టర్ గా కూడా పోయి నిర్మాతనే డైరెక్టర్ అయ్యాడు. అది అంతా సర్దుమణిగింది అనుకుంటూంటే ఇప్పుడు మరో వివాదం తెరమీదకు వచ్చింది.

 డెవిల్ చిత్రంలో విలన్ గా చేసిన మార్క్‌ బెనింగ్‌టన్‌ చిత్ర నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో నా పాత్ర షూటింగ్ పూర్తై తొమ్మిది నెలలు కావొస్తున్నా డబ్బులివ్వడం లేదని తీవ్ర విమర్శలు చేసారు. డెవిల్ విలన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాకు రావాల్సిన డబ్బులు అందలేదు. అంతేకాదు, నా పాత్రకుగానూ వేరే వ్యక్తితో డబ్బింగ్‌ చెప్పించారు. ఇలా చేయడం నాతో చేసుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించడమే అవుతుందని అగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడానికి కొంచమైనా సిగ్గుండాలంటూ ఘాటుగా స్పందించారు.

మర్క్ చేసిన ఆరోపణలపై డెవిల్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత మోహిత్‌ రాల్యాని సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. మోహిత్‌ రాల్యాని స్పందించాడు. నటుడి పోస్ట్‌కు కామెంట్‌ చేస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. 'నీ మేనేజర్‌ మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడో ఇచ్చేశాం. అయినా కూడా ఇంకా డబ్బు కావాలంటూ మానసికంగా వేధిస్తున్నారు. నీ పాత్రకు వేరేవారితో డబ్బింగ్‌ చెప్పిన విషయానికి వస్తే.. నువ్వు తెలుగు మాట్లాడగలవా? లేదు.. అలాంటప్పుడు ఇంగ్లీష్‌ డైలాగులకు నీ వాయిస్‌, తెలుగు డైలాగులకు వేరొకరి వాయిస్‌ ఎలా వాడగలం?

పైగా మీడియాలో మా నిర్మాణ సంస్థ ప్రతిష్ట దిగజార్చేలా వార్తలు ప్రచారం చేయిస్తున్నావు. నీ వాయిస్‌ వాడలేదని మమ్మల్ని కించపరుస్తున్నావు. నీ మాటలు నమ్మిన కొందరు నిజానిజాలు తెలుసుకోకుండానే వార్తలు రాసేస్తున్నారు. అసలు అగ్రిమెంట్‌లో నీ పాత్రకు నువ్వే డబ్బింగ్‌ చెప్పాలన్న నిబంధనే లేదు. ఎప్పుడేం చేయాలనేది నిర్మాత ఇష్టం. మనం ఇలా అందరి ముందు గొడవపడుతుండటం అసహ్యంగా ఉంది. నీపై నాకు చాలా గౌరవం ఉంది. ఆ విషయం నీక్కూడా తెలుసు. నీ నుంచి ఫోన్‌ కాల్‌ కోసం ఎదురుచూస్తుంటా' అని రాసుకొచ్చాడు. ఆ తర్వాత మార్క్‌ బెనింగ్‌టన్‌ డెవిల్‌ చిత్రయూనిట్‌ను తిడుతూ పెట్టిన పోస్టులను డిలీట్‌ చేశాడు.

ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌కు జంటగా.. సంయుక్త మీనన్‌, మాళవిక నాయర్‌ నటించారు. అభిషేక్‌ నామా దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా చేపట్టారు. ఫస్ట్‌ గ్లిప్స్‌ విడుదలైన తర్వాత.. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ట్రైలర్‌తో ఆ అంచనాలు ఆకాశాన్ని అంటాయి. బింబిసారలా కాకుండా ఈ మూవీ కథ మొత్తం బ్రిటీష్‌ ఎరాలోనే సాగుతుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో చిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు. దర్శకుడు అభిషేక్‌ నామా చాలా ప్రత్యేకంగా పాత్రను డిజైన్‌ చేశారట. మూవీలో లుక్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. డెవిల్‌ పాత్ర కోసం ఏకంగా 90 కాస్ట్యూమ్స్‌ రూపొందించారు. అది కూడా ఇటలీ నుంచి తెప్పించిన మోహైర్‌ ఊలుతో ఏకంగా 60 బ్లేజర్లను తయారు చేశారు. వీటితో పాటు 25 స్పెషల్‌ వెయిస్ట్‌ కోటులను తయారు చేశారు.