బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనె  స్టార్ డమ్ వేరు, ఆమె డిమాండ్ వేరు. ఆమె సౌత్ చిత్రాలలో నటిచడానికి అసలు ఇష్టపడరు. దీపికా కెరీర్ మొదలైంది సౌత్లోనే అయినా, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగాక ఇటువైపు చూడలేదు. అప్పుడెప్పుడో రజని కాంత్ నటించిన యానిమేటెడ్ మూవీ కొచ్చడయాన్ మూవీలో నటించింది. ఎట్టకేలకు ఆమె టాలీవుడ్ లో ప్రభాస్ 21 సినిమాతో అడుగుపెట్టనున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో పాటు, భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో దీపిక ఈ ప్రాజెక్ట్ ఒకే చేశారు. ఐతే బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి దీపిక సైన్ చేసినట్లు సమాచారం అందుతుంది. 

ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీ కథనం ప్రకారం షారుక్ ఖాన్ తో బాలీవుడ్ ప్రఖ్యాత ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న మూవీలో హీరోయిన్ గా దీపికా  పదుకొనె నటించనుందట. షారుక్ ఖాన్ చివరి చిత్రం జీరో విడుదలై రెండేళ్లు అవుతుంది. ప్రయోగాత్మక చిత్రంగా విడుదలైన ఆ మూవీ విజయం సాధించలేదు. వరుస పరాజయాలతో వెనుకబడ్డ షారుక్ కొంచెం గ్యాప్ తీసుకొని అచ్చొచ్చిన యష్ రాజ్ ఫిల్మ్స్ లో మూవీకి సిద్ధం అయ్యారు. ఈ చిత్రం నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఐతే ప్రభాస్ 21 మూవీ షూటింగ్ కూడా ఇదే సమయంలో మొదలుకానుంది. 

దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అశ్వినీ దత్ నిర్మాతగా ఉన్నారు.  ఈ ఏడాది చివర్లో ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టి 2022 లో విడుదల చేయనున్నట్లు అశ్వినీ దత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీపికా ఏక కాలంలో ప్రభాస్ మరియు షారుక్ చిత్రాలలో నటించనుందని తెలుస్తుంది. మరో వైపు షారుక్ కోసం ప్రభాస్ మూవీ వదిలేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత ఫార్మ్ చూసుకుంటే షారుక్ కంటే ప్రభాస్ ఓ మెట్టు పైన ఉన్నారు. కాబట్టి షారుక్ కోసం ప్రభాస్ మూవీని దీపికా వదిలేయడం అనేది అసాధ్యం.