దీపికా పదుకొనే లీడ్ రోల్ లో నటించిన సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి చిత్రం విడుదల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే రిలీజ్ వాయిదా వేసిన టీమ్ భవిష్యత్ లో అడ్డంకులన్నీ తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఈ చిత్రం రిలీజ్‌ను పలు రాష్ట్రాలు, పలు సంస్థలు అడ్డుకొంటున్నాయి. ఇప్పటికే యూపీ, ఎంపీ సర్కారులు పద్మావతి చిత్రం రిలీజ్ పై నిషేధం విధించాయి.

 

ఈ చిత్ర విడుదలపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఒక పథకం ప్రకారం అణగదొక్కుతున్నారని సినీ ప్రముఖులు, మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజకీయపక్షానికి అనుకూలంగానే ఈ తరహా వివాదాలని ఆరోపణలు ఊపందుకొంటున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

 

హైదరాబాద్ లో కూడా పద్మావతి సినిమాపై నిషేధం విధించాలని, లేకుంటే థియేటర్లు తగలపెడతామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించడంతో పద్మావతి నిరసన సెగలు హైదరాబాద్ నూ తాకాయి. హైదరాబాద్ లో రాజ్ పుత్ సమాజం లెక్క బాగానే వుండటం వల్ల ఒకవేళ ఇవాంక పాల్గొనే గ్లోబల్ సమ్మిట్ కు... పద్మావతి హిరోయిన్ దీపిక పడుకునే వస్తే భద్రత కల్పించడం కష్టమవుతుందనే ఉద్దేశంతోనే... సదస్సు నుంచి దీపికాను తొలగించినట్టు తెలుస్తోంది. దీపిక వస్తే ఏదైనా అవాంచనీయ సంఘటనలు జరిగితే ప్రపంచవ్యాప్తంగా డ్యామేజ్ జరిగే ప్రమాదం వున్న నేపథ్యంలో దీపిక రాకున్నా పెద్ద సమస్య లేదని తెలంగాణ సర్కారు ఆమెను ఈ సమ్మిట్ కు దూరంగా వుంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ సదస్సు హైదరాబాద్‌లో నవంబర్ 28న జరుగనున్నది.

 

పద్మావతి చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలిగించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న దృశ్యాలను తొలిగించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించిన జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం.. అలాంటి చర్య అపరిపక్వ చర్య అవుతుందని పేర్కొన్నది. సుప్రీం సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఇంకా సర్టిఫికెట్ ఇవ్వనేలేదని, అలాంటప్పుడు నిషేధం గురించికానీ, సన్నివేశాల తొలిగింపునకు ఆదేశాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎంఎల్ శర్మ వాదనలు వినిపిస్తూ.. రాణి పద్మావతిని కించపరిచేలా సినిమాలో చిత్రీకరించారని ఆరోపించారు.

 

మరోవైపు పద్మావతి చిత్రంలో ఎలాంటి అభ్యంతకర దృశ్యాలు లేవని, దానిపై అగ్రహించడంలో అర్థమే లేదు అని బాలీవుడు నటుడు షాహిద్ కపూర్ అన్నారు. ఆ చిత్రంలో చిత్తోడ్‌రాజు రతన్‌సింగ్‌గా షాహిద్ నటించిన విషయం తెలిసిందే. మరోవైపు దీపిక, బన్సాలీ తలనరికినవారికి రూ.10కోట్లు నజరానాగా ఇస్తామని హర్యానా బీజేపీ నేత చేసిన ప్రకటనపై నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

 

మరోవైపు పద్మావతి సినిమాను సమర్థిస్తున్న ప్రభుత్వాలున్నాయి. దీపిక పదుకొనేను బెదిరిస్తున్న సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇటీవల ఓ గ్రూపు ముక్కుకోస్తామని కూడా బెదిరించింది. ప్రజాస్వామ్యంలో ఇది అనాగరికం. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా సీఎంను కోరుతున్నాను. బెంగళూరులోని దీపిక కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

 

భావ స్వేచ్చ పేరుతో చరిత్రను వక్రీకరిస్తే ఎవరూ హర్షించరు. నిరసనకారుల ఆవేదనలో అర్థం ఉంది. పద్మావతి త్యాగాన్ని ఎన్నో ఏండ్ల నుంచి చదువుకుంటూ వచ్చాం. ఆ చరిత్రను వక్రీకరిస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ సహించరు అని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ అన్నారు.

 

అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించనంత వరకు పద్మావతి చిత్రాన్ని రిలీజ్‌కు అనుమతించేది లేదని రాజస్థాన్ సీఎం వసుంధర స్పష్టం చేశారు. సినిమాపై నిషేధం విధించేందుకు తగిన న్యాయనిపుణుల సలహాలను తీసుకొంటున్నామని ఆమె అన్నారు.

 

మొత్తానికి వివాదాస్పదం కావటంతో ప్రస్థుతానికి రిలీజ్ వాయిదావేశారు. మళ్లీ విడుదలకు ఆటంకం కలగకుండా సీన్స్ తొలగిస్తారా లేక మరేదైనా పరిష్కారం కనుగొంటారా చూడాలి.