విదేశీ చిత్రాల కోటాలో భారతదేశం నుంచి ఆస్కార్ నామినేషన్ రేసులో 28 సినిమాలు నిలిచాయి. వీటిలో తెలుగు నుండి డియర్ కామ్రేడ్ మాత్రమే పరిశీలన జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ 28 చిత్రాల్లో తమిళ్ నుంచి 3 సినిమాలు ఉండడం విశేషం. 

తాజాగా అధికారికంగా విడుదలైన ప్రకటన ప్రకారం భారతదేశం నుంచి ఆస్కార్ కు గల్లి బాయ్ సినిమా నామినేట్ అయ్యింది. రణ్ వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రం మిగిలిన 27 చిత్రాలను తోసిరాజేసి భారతదేశం తరుపున నామినేట్ అయ్యింది. 

అంధధూన్, ఆర్టికల్ 15 వంటి ఎన్నో విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలు కూడా నామినేట్ అయ్యేందుకు పోటీపడ్డాయి. కానీ చివరకు జోయా అక్తర్ దర్శకత్వం వహించిన గల్లీ బాయ్ భారతదేశం నుంచి అధికారిక ఆస్కార్ ఎంట్రీగా నిలిచింది. ఇండియన్ రాపర్స్ డివైన్, నాజి ల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి రాప్ మ్యూజిక్ లో ఉన్నత శిఖరాలను చేరుకున్న ఒక రాపర్ కథాంశంతో ఈ సినిమాను నిర్మించారు. 

భరత్ కమ్మ దర్శకత్వం వహించిన డియర్ కామ్రేడ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంతపెద్ద సక్సెస్ కాలేకపోయినా, మహిళా సమస్యలను చాల సున్నితంగా చూపెట్టిన విధానం చేత ఈ సినిమా భారత ఆస్కార్ ప్రాబబుల్స్ లో చోటు సంపాదించింది. కానీ ఆస్కార్ కు మాత్రం నామినేట్ కాలేకపోయింది. 

భారీ బడ్జెట్ తో నిర్మించిన, మన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ సగం డైరెక్ట్ చేసిన మణికర్ణిక సినిమా ఈ 28 సినిమాల లిస్టులో చోటు కూడా సంపాదించలేకపోవడం గమనార్హం.