దశాబ్దాల పాటు తన పాటలతో శ్రోతలకు ఆనందం పంచిన బాలు నిర్జీవంగా పడుకొని ఉండగా అభిమానుల గుండె పగిలిపోతుంది. ఆయన పార్దీవ శరీరం చూసిన సంగీత ప్రియులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
పాటంటే బాలు, బాలు అంటే పాట..సినిమా పాటకు చిరునామాగా మారిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ సంగీత గనిని శ్రోతల కోసం వదలిపోయారు. నీ మూడ్ ఏదైనా దానికి మందు మాత్రం బాలు పాటే అవుతుంది. సంగీత దర్శకుల బాణీలకు బాలు గొంతు ప్రాణం పోసింది. వారి పాటలను సజీవ చిత్రాలుగా మలిచింది.
మృత్యువు కూడా 50రోజులు వేచి చూసి బాధగా ఆయన్ని తనతో తీసుపోయింది. బాలు తన పాటలను ఇంకా కొన్నాళ్లు శ్రోతలకు వినిపించాలని మృత్యువుతో యుద్ధం చేసినట్లు ఉన్నారు. చివరికి మృత్యువుదే పై చేయి కావడంతో అభిమానులకు తీరని శోకం మిగిలింది.
వేదిక ఏదైనా తన పాటలతో, మాటలతో ఆడియన్స్ లో హుషారు నింపే బాలు పార్దీవ దేహం చూస్తుంటే మనసు కలచి వేస్తుంది. వేల పాటలు పాడిన గొంతు మౌనం పాటిస్తుండగా కన్నీరు ఆగడం లేదు. ఎలాగైనా బాలు తిరిగి వస్తారని నమ్మిన ఆయన అభిమానులు ఆయన పార్దీవ దేహాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు.
