విజయదశమి వీర విహారం ఏ సినిమాది,డేంజర్ జోన్ లో ఎవరు?
ఈ దసరా కానుకగా తెలుగులో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, కోలీవుడ్ నుంచి డబ్బింగ్ మూవీగా లియో ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.

ఈ దసరా కానుకగా తెలుగులో మూడు సినిమాలు 'భగవంత్ కేసరి', 'లియో', 'టైగర్ నాగేశ్వర రావు' మన ముందుకు వచ్చాయి. ఈ సినిమాలకు అదిరిపోయే టాక్ మొదటి రోజు రాలేదు. అయితే క్రేజ్ పరంగా లియో కుమ్మేసింది. భగవంత్ కేసరి మెల్లిమెల్లిగా పుంజుకుంది. టైగర్ నాగేశ్వరరావు మాత్రం లెంగ్త్ కట్ చేసినా ఫలితం పెద్దగా కనపడటం లేదు. ఈ క్రమంలో ఈ మూడు పెద్ద సినిమాల్లో విజేత ఎవరో క్లారిటీ వచ్చేసినట్లే. టాక్, వసూళ్లు, రెస్పాన్స్ ని ప్రాతిపదికన తీసుకుంటే భగవంత్ కేసరినే విన్నర్ అని చెప్పాలి. అయితే బ్రేక్ ఈవెన్ మొదటగా అయ్యే చిత్రంగా మాత్రం లియో నిలుస్తుంది..
లియోకు డివైడ్ టాక్ వచ్చినా ఓ సారి చూసేద్దాం అనుకునేవారు ఎక్కువ మంది ఉండటం ప్లస్ అయ్యింది. అదే సమయంలో డబ్బింగ్ మూవీ కావడం వల్ల దానికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ కేవలం 16 కోట్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువే. దాంతో మొదటి మూడు రోజులు వచ్చిన కలెక్షన్స్ తో దాదాపు బ్రేక్ ఈవెన్ అయ్యిపోయినట్లే అని తెలుస్తోంది. ఇంక లాభాల్లోకి వెళ్తుందా లేదా..వెళ్తే ఏ మేరకు అనేది రేపటికి క్లారిటీ వచ్చేస్తుంది. టైగర్ నాగేశ్వరరావు మాత్రం ట్రిమ్ చేసినా పెద్దగా కలిసి వచ్చిందేమీ లేదు. బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలో ఉంది.
బ్రేక్ ఈవెన్ లెక్కలో చూసుకుంటే లియోదే పై చేయి. పబ్లిక్ రెస్పాన్స్, థియేటర్ ఆక్యుపెన్సీ వరకు భగవంత్ కేసరి నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే ఈ రోజు నుంచి డ్రాప్ ఏ మేరకు ఉంటుందో చూడాలి. నందమూరి నటసింహాం బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' కు దసరా పండుగతో పాటు వీకెండ్ రావడం కలిసివచ్చింది. సినిమాలో అనవసరంగా పాటలు, ఫైట్లు పెట్టలేదు.. కామెడీ సీన్లు ఉండవు.. కేవలం కథ ప్రకారం ముందుకు వెళుతుంది దాంతో చాలా మందికి నచ్చుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో 70 కోట్లు గ్రాస్.. 37 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 31 కోట్లు కలెక్ట్ చేయాలి. నెక్ట్స్ వీక్ సినిమాలు లేకపోవడం.. మరో రెండు మూడు రోజులు హాలీడేస్ ఉండటంతో.. కలెక్షన్స్ డ్రాప్ అవ్వకపోతే భగవంత్ కేసరి సేఫ్ అవుతుంది.