హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటలు, టీజర్‌లు రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు రెట్టించాయి.

ఈ మూవీలో హీరో  కార్తికేయ శవాలు మోసే బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ఇరగదీశాడు. ఈ జోష్‌లో ఉండగానే సైబరాబాద్‌ పోలీసులు హీరో కార్తికేయ (బస్తీ బాలరాజు)కు వార్నింగ్‌ ఇచ్చారు.

చావు కబురు చల్లగా సినిమాలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి బైక్‌పై వెళ్తున్న సన్నివేశం ఒకటి వుంది. ఈ ఫోటోను షేర్‌ చేస్తూ..'హెల్మెట్ పెట్టుకుని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు' అంటూ ట్వీట్‌ చేశారు. దీనిని కార్తికేయ, లావణ్య త్రిపాఠిలకు ట్యాగ్‌ చేశారు.

ట్రాఫిక్‌ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ల సాయంతో ట్రాఫిక్‌పై ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.

వీటికి మంచి ఆదరణ లభించింది. తాజాగా చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సినిమా పోస్టర్‌ను వాడి హెల్మెట్‌ అవశ్యకత గురించి చెప్పడం నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.