ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌పై బంజారా హిల్స్‌ పోలీస్‌లకు ఓ ఫిర్యాద అందింది. రోడ్‌ నంబర్‌ 12లో ఉంటున్న ఓ మహిళ తనపై ప్రతాని రామకృష్ణ గౌడ్‌తో పాటు ఆయన కుమారుడు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదు చేసింది. తన బిల్డింగ్‌ను అద్దెకు తీసుకొని అద్దె చెల్లించకుండా వేదిస్తున్నాడంటూ సదరు మహిళ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. 2018లో మినిస్టర్‌ క్వార్టర్స్‌ ఎదురుగా బిల్డింగ్‌ను నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌కు  తెలంగాణ ఫిలిం కల్చరల్‌ సెంటర్‌(టీఎఫ్‌సీసీ) ఏర్పాటు కోసం అద్దెకు తీసుకున్నాడు. నెలకు నాలుగున్నర లక్షల అద్దె చెల్లించేందుకు 40 లక్షల అడ్వాన్స్ ఇచ్చేందుకు అంగీకరించాడు. కానీ కేవలం 30 లక్షలు మాత్రమే అడ్వాన్స్ చెల్లించాడు. ఆ తరువాత అద్దె కూడా సరిగా చెల్లించకుండా వేదింపులకు గురిచేశాడని నవ్వాడ శోభారాణి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత పది రోజుల కిందట ఇక తాను అద్దె చెల్లించలేనంటూ తాళాలు అప్పగించి ప్రతాని రామకృష్ణ గౌడ్‌ వెళ్లిపోయాడని, తరువాత అతని కుమారుడు సందీప్‌ తన ఇంటి మీదకు వచ్చి దౌర్జన్యానికి దిగాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి తనకు ప్రభుత్వంలో పెద్దలు తెలుసని, మాతో పెట్టుకుంటే అంతు చూస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కోన్నారు.