డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. హీరో రామ్ కు కూడా ప్రస్తుతం ఓ హిట్ మూవీ అవసరం. వీరిద్దరి కాంబినేషన్ లో తెరక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేసుకున్న పూరి తన సత్తా నిరూపించేందుకు సిద్ధం అవుతున్నాడని టాక్. పూరి మార్క్ పంచ్ డైలాగ్స్ ఈ చిత్రంలో హైలైట్ కానున్నాయట. 

షూటింగ్ ప్రారంభం నుంచే ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి పాజిటివ్ బజ్ మొదలయింది. దీనితో ఈ చిత్ర పంపిణి హక్కులు సొంతం చేసుకునేందుకు బయ్యర్లు ఆసక్తి చూపుతున్నారట. సీనియర్ హీరోయిన్ చార్మి ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ క్రేజీ ఆఫర్ ని చార్మి ముందు ఉంచాడట. ప్రపంచ వ్యాప్తంగా ఇస్మార్ట్ శంకర్ థియేట్రికల్ హక్కుల కోసం 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడట. 

సినిమా ఇంతవరకు పూర్తి కాకముందే ఇలాంటి డీల్ రావడం విశేషమే. కానీ ఈ ఆఫర్ ని చార్మి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ బిజినెస్ ని ఇంకా ప్రారంభించలేదని సదరు డిస్ట్రిబ్యూటర్ కు తెలిపిందట. బిజినెస్ ఓపెన్ చేయగానే మొదటి ప్రాధాన్యత మీకే ఇస్తానని కూడా చార్మి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చార్మి 20 కోట్ల డీల్ కే ఒప్పుకోలేదంటే ఇస్మార్ట్ శంకర్ చిత్రం అంతకు మించిన విజయం సాధిస్తుందనే ధీమా ఉన్నట్లు ఉంది. నభా నటేష్, నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.