నందమూరి నటసింహం బాలయ్య తన స్థాయి హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. 2014లో వచ్చిన లెజెండ్ తరువాత మరలా ఓ భారీ విజయాన్ని ఆయన నమోదు చేయలేదు. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన బాలయ్య ఆ జోరు చూపించలేక పోతున్నారు. ఇక 2019 అయితే బాలయ్య కెరీర్ లోనే డిజాస్టర్స్ ఇయర్ గా నిలిచిపోతుంది. ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నటించి నిర్మించిన ఎన్టీఆర్ బియోపిక్స్ ఘోరపరాజయాన్ని చవిచూశాయి. 

అలాగే ఏడాది చివర్లో వచ్చిన రూలర్ సైతం మరో డిజాస్టర్ గా నిలిచింది. వరుస పరాజయాలు బాలయ్యను సందిగ్ధంలో పడవేశాయి. దానితో కలిసొచ్చిన కాంబినేషన్ లో మూవీకి సిద్ధం అయ్యారు. సింహ, లెజెండ్ వంటి రెండు భారీ హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు బోయపాటితో మూవీకి కమిటయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఖచ్చితంగా హిట్ కొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

కాగా ఈ మూవీ హీరోయిన్స్ పై పూర్తి స్పష్టత లేదు. ఐతే బాలయ్యకు హిట్ ఫెయిర్ గా చెప్పుకొనే హీరోయిన్ సిమ్రాన్ ని ఓ పాత్ర కోసం తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మధ్య వయసుకుడైన బాలయ్య పాత్రకు హీరోయిన్ గా సిమ్రాన్ నటించనున్నారని ఆ వార్తల సారాంశం. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే. బాలయ్య సిమ్రాన్ కలిసి అనేక సినిమాలలో నటించగా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు.