పుండు మీద కారంలా అఖిల్ 'ఏజెంట్' కి బిగ్ షాక్.. ఓటీటీ స్ట్రీమింగ్ పై స్టే విధించిన కోర్టు
అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి దారుణ పరాజయం ఎదుర్కొందో తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి దారుణ పరాజయం ఎదుర్కొందో తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏజెంట్ మూవీని దాదాపు 80 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. కానీ పది శాతం పెట్టుబడిని కూడా ఈ చిత్రం రికవరీ చేయలేకపోయింది. ఫలితంగా నిర్మాతతో పాటు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన బయ్యర్లు కూడా దారుణంగా దెబ్బతిన్నారు.
ఈ చిత్రం విడుదలై ఐదు నెలలు గడుస్తున్నా ఇంకా ఓటిటిలోకి రిలీజ్ కాలేదు. డిస్ట్రిబ్యూటర్లతో వివాదం కారణంగా ఈ చిత్ర ఓటిటి స్ట్రీమింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ముఖ్యంగా వైజాగ్ సతీష్ అలియజే బత్తుల సత్యనారాయణతో నిర్మాత అనిల్ సుంకరకి వివాదం జరుగుతోంది.
తనకు మూడు ప్రాంతాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇస్తామని చెప్పి 30 కోట్లు తీసుకున్నారు. కానీ కేవలం వైజాగ్ ఏరియా హక్కులు మాత్రమే ఇచ్చారని సతీష్ ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత తనకి తిరిగి ఇవ్వాల్సిన డబ్బు విషయంలో నిర్మాత నిర్లక్ష్య ధోరణిలో ఉన్నట్లు సతీష్ ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కారణంగానే అఖిల్ ఏజెంట్ ఓటిటి రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
అయితే ఎట్టకేలకు ఏజెంట్ ఓటిటి స్ట్రీమింగ్ ఫిక్స్ చేసుకుంది. సోని లివ్ ఓటిటి వేదికగా ఏజెంట్ ఈనెల 29న స్ట్రీమింగ్ మొదలు కానుంది. కానీ అంతలోనే ఏజెంట్ కి బిగ్ షాక్ తగిలింది. ఏజెంట్ ఓటిటి రిలీజ్ ని అడ్డుకునేందుకు డిస్ట్రిబ్యూటర్ సతీష్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ నేడు విచారణకు రాగా.. వాదనలు విన్న కోర్టు ఏజెంట్ ఓటిటి రిలీజ్ ని ఆపివేస్తూ స్టే విధించింది. కోర్టు నిర్ణయం నిర్మాతకు పుండు మీద కారం చల్లినట్లు అయింది. మరి చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.