హిందీలో రూపొందిన వెబ్‌ సిరీస్‌ `తాండవ్‌` ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది మహారాష్ట్ర అయ్యింది. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రలో, డింపుల్‌ కపాడియా, మహ్మద్‌ జీషన్‌ అయూబ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ని అలీ అబ్బాస్ జాఫర్‌ దర్శకత్వం వహించారు. ఏ.ఆర్‌ రెహ్మాన్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 15న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ వివాదాలకు కేరాఫ్‌గా మారింది. 

ఈ వెబ్‌ సిరీస్‌లో హిందూ దేవుళ్లని కించపరిచారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర కర్ణి సేన చీఫ్‌ సెంగర్‌ `తాండవ్‌` వెబ్‌ సిరీస్‌ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లని అవమానించిన వారి నాలుక కోసిన వారికి కోటీ రూపాయల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. ఈ వెబ్‌ సిరీస్‌పై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం స్పందించి క్షమాపణలు చెప్పింది. అయితే క్షమాపణలు ఆమోదయోగం కాదని అజయ్‌ సెంగర్‌ తెలిపారు. 

మరోవైపు ఈ వెబ్‌ సిరీస్‌ చిత్ర బృందం, అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా ఉన్నతాధికారిపై ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా హెడ్‌ ఆఫ్‌ ఒరిజినల్‌ కంటెంట్‌ అపర్ణ పురోహిత్‌, వెబ్‌ సిరీస్‌ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌, నిర్మాత హిమాన్షు మెహ్రా, రచయిత గౌరవ్‌ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో సినిమాని సినిమాగా చూడాలని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా `తాండవ్‌` వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది.