సినిమా రివ్యూలు ఇవ్వాలంటే  సమీక్షకుడుకి విచక్షణ,విమర్శనా జ్ఞానం ఉండాలి.  అప్పుడే  క్రెడిబులిటీ క్రియేట్ అవుతుంది. అంతేకానీ తనను తాను హైలెట్ చేసుకోవటానికి చేతికొచ్చిన రాతలు రాయకూడదు. ట్విట్టర్ ఎక్కౌంట్ ఉంది కదా అని రెట్టలు వేయకూడదు. ఇవరి గురించి ఇదంతా అంటారా.. ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు గురించి. ఆయన ప్రతీ పెద్ద తెలుగు సినిమాకూ రిలీజ్ కు ముందే రివ్యూ ఇచ్చేస్తూంటాడు. పడి ఉంటుంది కదా అని ఇష్టం వచ్చిన రేటింగ్ ఇచ్చేస్తూంటాడు.

రిలీజ్ కు రెండు రోజులు ముందు ఆ రివ్యూ పెడతాడు కాబట్టి...ఫస్ట్ రివ్యూ వచ్చేసింది అంటూ ప్రతీ తెలుగు మీడియా దీన్ని కవర్ చేస్తుంది. అతన్ని హైలెట్ చేస్తుంది.  అలాగే ఆ సినిమా హీరో ఫ్యాన్స్ ఆ ట్వీట్స్ ని రీట్వీట్ చేస్తూంటారు. ఇది చాలా కాలంగా జరుగుతోంది. ఆ రివ్యూలు నిజమైతే అందరూ ఆనందపడేవాళ్లే. అయితే ఎప్పుడూ ఈ రివ్యూలు లాటరీనే. సినిమా హిట్టైనప్పుడు మాత్రమే అతని రివ్యూ నిజమౌతుంది. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడూ ఆయన సినిమా అద్బుతం అంటూ రాస్తాడు కాబట్టి.

రీసెంట్ గా ఇతగాడి ట్విట్టర్ హ్యాక్ కావడంతో కొత్త అకౌంట్ ఓపెన్ చేసి మరీ రివ్యూలు ఇస్తున్నారు. మోస్ట్ కాంట్రవర్సియల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ క్రిటిక్‌గా తనని తాను ప్రకటించుకున్న ఈ రివ్యూ రైటర్... పెద్ద సినిమా రిలీజ్ ల టైమ్ లో ట్విట్టర్‌లో హాట్ టాపిక్. ఇప్పుడు కూడా ‘వకీల్ సాబ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రివ్యూ ఇచ్చారు. కాదనే ధైర్యం ఎవరికి ఉంటుందనే థీమా అతనిది.  సాలిడ్, టెర్రిఫిక్.. పవన్ కళ్యాణ్ బ్యాక్ విత్ బ్యాంగ్ అంటూ వరసగా  ట్వీట్ స్వీట్లు ఫ్యాన్స్ కు  పెట్టాడు. వకీల్ సాబ్ చిత్రానికి రివ్యూ ఇచ్చి.. ఈసారి నాలుగు స్టార్లు వేశాడు.

కాకపోతే జనం నమ్మాలని...కథనం కాస్త నెమ్మదిగా ఉండటం ఈ చిత్రానికి మైనస్ అని,  ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కథనం స్లోగా ఉంటుంది అని అన్నాడు.  అయితే కథ మాత్రం ఎంగేజింగ్‌గా కట్టిపడేస్తుందని,  ఎట్టిపరిస్థితుల్లోనూ మిమ్మల్ని నిరాశపరచదు.. గ్రిప్పింగ్ స్రీన్ ప్లేతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చాడు.  కొన్ని సీన్లు స్టన్నింగ్‌గా స్పీచ్ లెస్ అనిపించేట్టుగా ఉంటాయని.. కూడా అన్నాడు.  అయితే ఇతగాడు గతంలో కాటమరాయుడు, అజ్ఞాతవాసి, స్పైడర్, సాహో చిత్రాలకు కూడా రిలీజ్ కు ముందే బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రివ్యూలు ఇచ్చేసాడు. అవేమీ వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు  ‘వకీల్ సాబ్’ విషయంలో ఆయన మాటలు నిజమయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే సినిమా సాలిడ్ గా హిట్ అనే టాక్ ఉంది. అయితే ఈ రివ్యూలు ఆయన సినిమా నిజంగా చూసి ఇస్తున్నాడా లేక గాల్లోకి రాళ్లు విసిరే గేమ్ ప్లే చేస్తున్నాడా తెలియాల్సి ఉంది. అప్పటిదాకా ఆయన రివ్యూలు నమ్మటం కష్టమే.