`జాతిరత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శిలకు మరో నటుడు రాహుల్‌ రామకృష్ణ వార్నింగ్‌ ఇచ్చారు. చిటికేసి మరీ వారిని హెచ్చరించారు. అమెరికా నుంచి వస్తరు కదా వచ్చాక చూసుకుందాం. రండి మీ పని చెబుతా అంటూ హెచ్చరించాడు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. దీంతో ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. ఈ ముగ్గురు నటులు ఇటీవల `జాతిరత్నాలు` చిత్రంలో కలిసి నటించారు. విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మరి రాహుల్‌ రామకృష్ణ వార్నింగ్‌ ఇవ్వడానికి కారణమేంటనేది చూస్తే..

`జాతిరత్నాలు` సినిమా విజయం సాధించిన సందర్భంగా ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు ఈ నటులు. అందులో భాగంగా నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి అమెరికా వెళ్లారు. అక్కడ తమ సినిమా ఆడుతున్న సెంటర్లలో సక్సెస్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అయితే వీరితోపాటు రాహుల్‌ రామకృష్ణ అమెరికా వెళ్లలేదు. అయితే తనని వదిలేసి ఆ ఇద్దరే వెళ్లిపోవడంపై రాహుల్‌ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మేరకు ఆయన వీడియో ద్వారా హెచ్చరించారు. 

ఈ వీడియోలో `అరేయ్‌ దర్శి, నవీన్‌.. పీపుల్స్‌ ప్లాజాలో సక్సెస్‌మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. విమానమెక్కి యూఎస్‌ వెళ్లిపోతారేరా.! నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా పాన్‌ కార్డ్‌ ఉందని. పాన్‌కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా..! జోగిపేట రవిరా నేను. నా వల్లే ప్రాబ్లమ్‌ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా! మీరు రండ్రా వచ్చాక మీ సంగతి చెబుతా!` అంటూ రాహుల్‌ ఫన్నీ వీడియోని పంచుకున్నాడు. ఈ సందర్బంగా అమెరికాలో నవీన్‌, దర్శి సక్సెస్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్న వీడియోలని కోట్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్‌ అవుతుంది.