కమెడియన్ రఘు కారుమంచి కోట్ల రూపాయలు ఆర్జించినట్లు తెలుస్తుంది. ఆయన లగ్జరీ హౌస్ చూసిన జనాలు అమ్మో రఘుకి ఇంత పెద్ద ఇల్లు ఉందా? అని అడుగుతున్నారు.
ఆది మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు రఘు కారుమంచి. హీరో ఎన్టీఆర్ తో కాలేజ్ ఫైట్ సీన్లో రఘుతో కామెడీ చాలా హైలెట్ అయ్యింది. ముఖ్యంగా ఆయన చెప్పిన ఫెయిర్ అండ్ లవ్లీ డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్. ఆది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా... రఘును ఎన్టీఆర్, దర్శకుడు వివి వినాయక్ ప్రోత్సహించారు. తమ చిత్రాల్లో ఖచ్చితంగా రఘుకి ఒక పాత్ర ఇచ్చేవారు. అలాగే పలు హిట్ చిత్రాల్లో ఆయన నటించారు.
కెరీర్ కొంచెం నెమ్మదించాక రఘు కారుమంచి జబర్దస్త్ కమెడియన్ అవతారం ఎత్తాడు. ఈటీవీలో ప్రయోగాత్మకంగా 2013లో జబర్దస్త్ కామెడీషో స్టార్ట్ చేశారు. రఘు ... రోలర్ రఘు పేరుతో టీమ్ ఏర్పాటు చేసి స్కిట్స్ చేశాడు. అయితే ఆయన జబర్దస్త్ జర్నీ ఎక్కువ కాలం సాగలేదు. జబర్దస్త్ మానేసి మరలా సినిమాలపై దృష్టి పెట్టారు. కరోనా సమయంలో రఘు ఆర్థిక కష్టాలు పడ్డట్లు సమాచారం. వందల చిత్రాల్లో నటించిన రఘు స్టార్ కమెడియన్ కాలేకపోయారు.
అలాంటి రఘు ఇల్లు చూసి అందరి కళ్ళు బైర్లు కమ్మాయి. రఘు ఇంటిని చూపిస్తూ ఓ యూట్యూబ్ ఛానల్ హోమ్ టూర్ కండక్ట్ చేసింది. విశాలమైన ఆ లగ్జరీ హౌస్ చాలా అందంగా ఉంది. ఖరీదైన ఏరియాలో, ఉన్నతమైన కమ్యూనిటీ మధ్య రఘు ఇల్లు నిర్మించుకున్నారు. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉంది. ఇక రఘు తన ఇంటి పరిసరాలు గ్రీనరీతో నింపేశాడు. పళ్ళు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుతున్నారు.
తమ ఆహారంలో చాలా వరకు ఆర్గానిక్ పద్ధతిలో స్వయంగా పండించుకుంటానని రఘు చెప్పారు. కోట్ల రూపాయల విలువ చేసే ఆ ఇంటిని చూశాక రఘు ఈ రేంజ్ లో ఎప్పుడు సంపాదించారనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ మధ్య రఘు తెలంగాణలో రెండు వైన్ షాప్ లైసెన్సులు దక్కించుకున్నాడు. మరి మద్యం వ్యాపారంలో రఘు కోట్లకు పడగలెత్తాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి. నటుడిగా అయితే ఇంత మొత్తంలో ఆర్జించే అవకాశం లేదు. కారణం ఇప్పుడు ఆయన చేస్తుంది అడపాదడపా చిత్రాలు మాత్రమే.
