వైసీపీ గెలిచిందనే విషయాన్ని సినీ పరిశ్రమ తట్టుకోలేకపోతుందని అంటున్నారు కమెడియన్ పృధ్వీ.. చంద్రబాబు గెలిస్తే బొకేలు ఇవ్వడానికి సిద్ధమైన సినీ ప్రముఖులు జగన్ గెలిస్తే ట్వీట్ చేయడానికి కూడా ఇష్టపడడం లేదని అన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజుల పొద్దున్న విమానం ఎక్కి అభినందనలు చెప్పి, సాయంత్రం విమానంలో తిరిగొచ్చిన సెలబ్రిటీలు ఉన్నారని.. కౌంటింగ్ పూర్తికాకముందే శుభాకాంక్షలు చెప్పిన పెద్దలు ఉన్నారని.. వాళ్లు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. వారి అభినందనలు జగన్ కి అవసరం లేదు కానీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లుగా మేం కోరుకుంటున్నామని అన్నారు.

ఈ మేరకు తన వాట్సాప్ లో స్టేటస్ పెట్టాడు. సినిమా పెద్దలారా సీఎంను అభినందిచరా..? అంటూ ప్రశ్నించారు. బొడ్డు మీద బొప్పాయిలు కొట్టి వయసు మళ్లిన తరువాత భక్తిమార్గంలో ఎస్వీబీసీ భక్తిని పట్టిన దర్శకేంద్రుడికి ఇంకా జగన్ గెలుపు కనిపించలేదా..? అని అడిగారు. 

''నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవడమే మహా ఉద్యమంగా భావించి పొద్దున్నే విమానంలో వెళ్లిన సురేష్ బాబుకు జగన్ గెలుపు కనిపించలేదా? నిర్మాతలకే నిర్మాత, నిర్మాతల తాతలకే తాత అయిన అల్లు అరవింద్ కు ఇంకా జగన్ గెలుపు వార్త ఎవరూ చెప్పినట్టు లేదు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ రాజ్యంలో కలిపి ఊపిరిపీల్చుకున్న చిరంజీవి చెవిన జగన్ గెలుపు వార్త ఇంకా ఎవరూ వేయలేదేమో'' అంటూ సినీ ప్రముఖులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా వారిపై విమర్శలు చేయడం వలన తనకు సినిమా అవకాశాలు తగ్గినా పర్లేదని అంటున్నారు. ఎప్పట్నుంచో తమ సామాజిక వర్గాన్ని ఇండస్ట్రీ తొక్కుతూనే ఉందని మరోసారి ఆరోపణలు చేశారు.