ఆ రెండు చిత్రాల నుంచి నన్ను తీసేశారు.. చాలా బాధపడ్డా, షూటింగ్ కి వెళ్లి తిరిగొచ్చేశా.. కమెడియన్ పృథ్వీ
కమెడియన్ పృథ్వీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా పృథ్వీ ఓ ఇంటర్వ్యూలో తాను నటుడిగా బాధపడ్డ సందర్భాలు గుర్తు చేసుకున్నారు.

కమెడియన్ పృథ్వీ పేరు చెప్పగానే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి. 2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామానే చేసారు. ప్రచారం కోసం రాష్ట్రం మొత్తం తిరిగారు. ఫలితంగా సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత మహిళతో ఫోన్ సంభాషణ లీక్ అయిన కారణంగా పృథ్వీ పదవి కోల్పోవడం, ఇబ్బందుల్లో చిక్కుకోవడం జరిగింది.
కమెడియన్ పృథ్వీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా పృథ్వీ ఓ ఇంటర్వ్యూలో తాను నటుడిగా బాధపడ్డ సందర్భాలు గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ హీరోగా నటించిన ఓ చిత్రంలో అత్యంత కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
షూటింగ్ కి రెడీ అయిన తర్వాత చెప్పారు.. ఆ పాత్ర కోసం మరొకరిని ఎంపిక చేశారు అని. దీనితో చాలా నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయా. అదే విధంగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో దేవుళ్ళు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అది అలాంటి ఇలాంటి పాత్ర కాదు.. శ్రీరాముడి పాత్రలో నటించే ఛాన్స్. రాముడిగా నన్ను.. సీతగా లయని ఎంపిక చేశారు. లుక్ టెస్ట్ కూడా చేశారు.
మేకప్ వేసుకున్న తర్వాత రాముడి గెటప్ లో ఎన్టీఆర్ లాగా ఉన్నారు అంటూ భద్రాచలం పూజారులు సైతం ప్రశంసించారు. కానీ సడెన్ గా సెట్ లోకి శ్రీకాంత్ వచ్చారు. ఆయన మరో పాత్ర చేస్తున్నారేమో అనుకున్నా. కానీ ఆయనే రాముడి పాత్రలో నటిస్తున్నారు అని చెప్పారు. ఆయా విధంగా నన్ను తొలగించడం తీవ్రంగా బాధించింది అని పృథ్వీ పేర్కొన్నారు. ఆ విధంగా నటుడిగా బాధపడిన క్షణాలు చాలా ఉన్నాయి అని అన్నారు.
పృథ్వీ ఎలాంటి పాత్ర చేసినా వెంటనే ఆడియన్స్ లోకి వెళ్ళిపోతుంది. రీసెంట్ గా బ్రో చిత్రంలో పృథ్వీ కేవలం నిమిషం పాటు చేసిన శ్యామ్ బాబు పాత్ర ఎంత కాంట్రవర్సీగా మారిందో తెలిసిందే.