`బ్రో` సినిమాలో నిమిషం పాటు ఉన్న శ్యాంబాబు పాత్రకే ఏపీలో వైసీపీ నాయకులు నానా రచ్చ చేశారు. అదే ఆయన పాత్ర రెండు గంటలపాటు ఉంటే, ఇక దాన్ని ఊహించడం కష్టమే. 

`బ్రో` సినిమాలో నిమిషం పాటు ఉన్న `శ్యాంబాబు` పాత్రకే ఏపీలో వైసీపీ నాయకులు నానా రచ్చ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ని ఏకి పడేస్తున్నారు. `బ్రో` సినిమాని తూర్పార పట్టారు. డిజాస్టర్ అని కామెంట్లు చేశారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు నానా రచ్చ చేశాడు. ఏపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులంతా ప్రభుత్వ కార్యకలాపాలంటే `బ్రో` సినిమాని, పవన్‌ని విమర్శించడానికే ప్రయారిటీరి ఇచ్చారు. అంతగా రచ్చ చేసిందీ ఆయా సన్నివేశం. 

అదే రెండుగంటల పాటు `శ్యాంబాబు` పాత్ర ఉంటే.. ఏపీ రాజకీయాలను ఊహించడమే కష్టంగా ఉంది. మరి అలాంటి పనికి, అలాంటి డేరింగ్‌కి రెడీ అవుతున్నారు నటుడు, కమెడియన్‌ 30 ఇయర్స్ పృథ్వీ. ఈ సారి తాను రెండు గంటల శ్యాంబాబు పాత్రతో రాబోతున్నానని తెలిపారు. ఓ వీడియోలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు పృథ్వీ రాజ్‌. `శోభన్‌బాబు` పేరుతో ఓ సినిమా రూపొందుతుందని, అందులో తాను శ్యాంబాబుగా కనిపిస్తానని, ఆ పాత్ర రెండుగంటలపాటు ఉంటుందన్నారు. `బ్రో` సినిమాలో తన పాత్రని ఆదరించినట్టుగానే `శోభన్‌బాబు` సినిమాలోని తన శ్యాంబాబు పాత్రని ఆదరించాలని ఆయన వెల్లడించారు. 

అయితే ఆ సినిమాకి సంబంధించిన వివరాలు మాత్రం త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. ఆ సినిమాకి దర్శకుడెవరు, హీరో ఎవరు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు,నిర్మాతల వివరాలను తాను త్వరలో చెబుతానని తెలిపారు పృథ్వీ. `ప్రముఖ రచయిత, దర్శకుడు నాకు ఒక బంపర్‌ ఆఫర్ ఇచ్చారు. `బ్రో` చిత్రంలో శ్యాంబాబు పాత్ర నిమిషం ఐదు సెకన్లపాటు ఉంది. నేను చేయబోయే `శోభన్‌బాబు` సినిమాలో రెండు గంటలు ఉంటుంది. నాకు అద్భుతమైన అవకాశం ఇది. ఆ రచయిత, దర్శకుడు, బ్యానర్‌ వివరాలు త్వరలోనే తెలియజేస్తా. అది నా కెరీర్‌ని మలుపుతిప్పే చిత్రం అవుతుంది. ఈ శ్యాంబాబుని అప్పుడు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని సెల్ఫీ వీడియోని పంచుకున్నారు పృథ్వీ. 

దీంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి అందులో `శ్యాంబాబు` పాత్ర పొలిటికల్‌ సెటైరికల్‌గా ఉంటుందా? లేక పూర్తి భిన్నంగా, కేవలం కామెడీ పాత్రగానే ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. కానీ పృథ్వీ ఈ విషయం చెప్పినప్పట్నుంచి ఇది పెద్ద ఎత్తున చర్చకు తావిస్తుంది. పృథ్వీ చేత ఎవరో గట్టిగానే ఏపీ ప్రభుత్వాన్ని గిల్లించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.