ప్రముఖ కోలీవుడ్‌ హాస్యనటుడు పాండు(74) కన్నుమూశారు. కరోనాతో ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి తోడు కరోనా వెంటాడటంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పాండు మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ షాక్‌కి గురయ్యిది. ఇటీవల వరుసగా కోలీవుడ్‌కి చెందిన ఆర్టిస్టులు, డైరెక్టర్స్ కన్నుమూయడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లింది. పాండుకి భార్య కుముధ, ముగ్గురు కుమారులు ప్రభు, పంచు, పింటు ఉన్నారు.

పాండు భార్య కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమం​ ఉన్నట్లు తెలుస్తోంది.  పాండు తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత చిత్రాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. అతను 1970 లో `మానవన్` సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు. `కరైల్లెం షేన్‌బాగపూ`తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది.  ఈ చిత్రంలో తన సోదరుడు ఇడిచాపులి సెల్వరాజ్‌తో పాండు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు. దీంతోపాటు `కాదల్‌ కొట్టై`, `పనక్కరన్‌`, `దైవ వాకు`, `రాజాది రాజా రాజా`, `నాట్టమై`, `ఉల్లతై అల్లితా`, `జోడి`, `వాలి`, `ఎన్నవాలే అండ్‌ సిటిజెన్‌` వంటి చిత్రాల్లో నటించారు. పాండు మృతి పట్ట కోలీవుడ్‌ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమెడియన్‌ మనోబాల ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.