`ఆన్‌లైన్‌లో ద్వేశాన్ని ఆపండి` అంటూ రతన్‌ టాటా చెప్పిన ఓ వార్తకు సంబంధించిన పేపర్‌ కటింగ్‌ను షేర్ చేసిన గణేష్‌.. `తెలిసి తెలియక నేనేమన్నా ఎవర్నన్నా బాధపెట్టిన తప్పు చేసిన పెద్ద మనసుతో క్షమించండి మీ బండ్ల గణేష్` అంటూ కామెంట్ చేశాడు.

టాలీవుడ్‌ తెర మీదే కాదు.. సినీ వేడుకల్లోనే ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌ చేసే స్టార్‌ కమెడియన్‌ కం బిగ్ ప్రొడ్యూసర్‌ బండ్ల గణేష్‌. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ భక్తుడిగా వేదికల మీద ఓ రేంజ్‌లో రెచ్చిపోయే గణేష్‌, రాజకీయాల్లోనూ తన మార్క్‌ చూపించాడు. గత ఎన్నికల్లో 7 ఓ క్లాక్‌ బ్లేడ్ డైలాగ్‌తో పాపులర్‌ అయిన గణేష్‌ కరోనా విషయంలోనూ వార్తల్లో నిలిచాడు. ఇటీవల బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలటంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

తరుచూ సినీ, రాజకీయ ప్రముఖులతో సన్నిహితంగా ఉండే గణేష్‌కు పాజిటివ్‌ అని తేలటంతో అంతా అవాక్కాయారు. అయితే కరోనా రిజల్ట్ వచ్చిన తరువాత బండ్ల గణేష్‌ మీడియా ముందుకు రాలేదు. సంచలనాత్మకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ తాజాగా మరోసారి తనదైన స్టైల్‌లో ట్వీట్ చేశాడు గణేష్‌. `ఆన్‌లైన్‌లో ద్వేశాన్ని ఆపండి` అంటూ రతన్‌ టాటా చెప్పిన ఓ వార్తకు సంబంధించిన పేపర్‌ కటింగ్‌ను షేర్ చేసిన గణేష్‌.. `తెలిసి తెలియక నేనేమన్నా ఎవర్నన్నా బాధపెట్టిన తప్పు చేసిన పెద్ద మనసుతో క్షమించండి మీ బండ్ల గణేష్` అంటూ కామెంట్ చేశాడు.

`ఈ సంవత్సరం అంతా సమస్యల్లో మునిగి ఉన్నాం. కొందరు ఆన్‌లైన్‌లో ఒకరి మనోభావాలను మరొకరు దెబ్బతీస్తున్నారు. అందరూ కలిసి అభివృద్ధి సాధించాల్సిన ఈ సమయంలో విద్వేషాన్ని పెంచే ధోరణి సరికాదు. ఓపిక, దయ, అర్థం చేసుకునేతత్వాన్ని మరింత పెంచుకుంటూ ముందుకెళ్దాం` అంటూ రతన్‌ ఇచ్చిన సందేశానికి సంబంధించిన పేపర్‌ కటింగ్‌ షేర్‌ చేసిన గణేష్‌ కామెంట్ చేశాడు.

ఎప్పుడు తాను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మాట్లాడే గణేష్‌ ఒక్కసారిగా నన్ను క్షమించండి అంటూ కామెంట్ చేసే సరికి నెటిజెన్లు అవాక్కయ్యారు.